బేషరతు క్షమాపణలు చెప్పిన 'తాండవ్' నటీనటులు, యూనిట్!

19-01-2021 Tue 09:07
  • 'తాండవ్'పై వెల్లువెత్తిన విమర్శలు 
  • హిందూ దేవతలను అవమానించారని కేసులు
  • ఎవరి మనోభావాలనూ దెబ్బతీయలేదన్న యూనిట్
Tandav Crewand Unit Appolisies

ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న రాజకీయ నేపథ్య సీరీస్ 'తాండవ్'పై విమర్శలు వెల్లువెత్తుతూ, దీన్ని నిషేధించాలన్న డిమాండ్ వస్తున్న వేళ, చిత్ర యూనిట్, నటీ నటులు బేషరతుగా క్షమాపణలు తెలిపారు.

ఇప్పటికే ఈ సిరీస్ లో హిందూ దేవుళ్లు, దేవతలను కించపరిచే సీన్లు ఉన్నాయని పలు రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో, తాము ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలని చూడలేదని, ఎవరి మనసునైనా నొప్పిస్తే, బేషరతు క్షమాపణలు కోరుకుంటున్నామని సదరు సీరీస్ యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

'తాండవ్' కేవలం ఫిక్షన్ మాత్రమేనని, జీవించివున్న, మరణించిన ఏ వ్యక్తికి, జరిగిన సంఘటనలకు సంబంధం లేదని, ఏదైనా సంబంధం కనిపిస్తే, అది కేవలం యాదృచ్ఛికమేనని పేర్కొంది. ఏ వ్యక్తి, కులం, మతం, వర్గం ప్రజల నమ్మకాలను, మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం లేదని, ఏ రాజకీయ పార్టీకీ తమ కథతో సంబంధం లేదని ఈ ప్రకటన స్పష్టం చేసింది.

కాగా, తాజా ఘటనల తరువాత అమెజాన్ ప్రైమ్ నుంచి సమాచార, పౌర సంబంధాల శాఖ వివరణ కోరిన నేపథ్యంలో ఈ క్షమాపణలు రావడం గమనార్హం. 'తాండవ్' వెబ్ సిరీస్ లో సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా, మహమ్మద్ జీషాన్, ఆయుబ్ తదితరులు నటించగా, సమకాలీన రాజకీయాల నేపథ్యంలో ఇది రూపొందింది.