Gujarat: గుజరాత్‌లో దారుణ రోడ్డు ప్రమాదం.. నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన లారీ, 15 మంది దుర్మరణం

15 Labourers Sleeping Near Road Crushed Under Truck In Gujarat
  • ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన లారీ
  • ఘటనా స్థలంలోనే 12 మంది మృత్యువాత
  • ప్రమాదం నుంచి బయటపడిన 9 నెలల చిన్నారి
గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 15 మంది వసల కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం సూరత్ తరలించారు. మృతులను రాజస్థాన్‌లోని బాన్స్‌వాడాకు చెందిన వారిగా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. గత అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కోసంబిలోని ఓ చౌరస్తా నుంచి మాండివైపు లారీ వేగంగా వెళుతోంది. అదే సమయంలో ఎదురుగా చెరకు లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ పైకి లారీని మళ్లించాడు.

ఈ క్రమంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 18 మంది కూలీల పైనుంచి లారీ దూసుకుపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే 12 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుంచి 9 నెలల చిన్నారి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gujarat
Surat
Truck
Lorry
Road Accident

More Telugu News