శశికళ విడుదలైతే ఏంటి?: తమిళనాడు మంత్రి జయకుమార్

19-01-2021 Tue 08:23
  • త్వరలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ
  • ఆమె వెంట ఎవరూ వెళ్లబోరన్న మంత్రి
  • పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
There is no changes in Tamil Politics if sasikala comes
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ వేడి రగులుకుంది. ఆమె రాకతో రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న వార్తలపై తమిళనాడు మంత్రి జయకుమార్ స్పందించారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆమె జైలు నుంచి విడుదలయ్యాక కూడా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవించబోవని స్పష్టం చేశారు.

శశికళ, ఆమె బంధువులు, మద్దతుదారుల ప్రమేయం లేకుండానే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని జయకుమార్ తెలిపారు. శశికళ కుటుంబం వద్ద కోట్లాది రూపాయలు ఉన్నాయని, ఆ సొమ్ముతో కొన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే, శశికళ వెంట పార్టీ నేతలు ఎవరూ వెళ్లే అవకాశం లేదని తెగేసి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై మాత్రం వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు.