ధనిక దేశాలకు 39 మిలియన్ల డోసులు అందితే ఒక పేద దేశానికి 25 డోసులే అందాయి: డబ్ల్యూహెచ్ఓ

18-01-2021 Mon 21:55
  • జెనీవాలో డబ్ల్యూహెచ్ఓ సమావేశం
  • వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలపై టెడ్రోస్ ఆవేదన
  • ధనిక దేశాల్లో యువతకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారని వెల్లడి
  • వ్యాక్సిన్ తమకే ముందు దక్కాలంటున్నారని విమర్శలు
WHO Director General Tedros Adhanom hits out wealthy countries on corona vaccine distribution

ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు వ్యాక్సిన్లు రంగప్రవేశం చేశాయి. అయితే కరోనా టీకాల పంపిణీలో అసమానతలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రీసియస్ ఆవేదన వ్యక్తం చేశారు. 49 ధనిక దేశాలకు 39 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందితే ఒక పేద దేశానికి కేవలం 25 డోసులే అందాయని విచారం వెలిబుచ్చారు. ధనిక దేశాల్లో యువతకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుతోందని వెల్లడించారు.

"వ్యాక్సిన్ మాకే ముందు దక్కాలి" అనే విధంగా ధనిక దేశాల వైఖరి ఉందని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ధనిక దేశాల తీరు చూస్తే ప్రపంచం దారుణమైన రీతిలో నైతిక వైఫల్యం అంచున నిలిచినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను కూడా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా టీకాకు ఆమోదం కోసం డబ్ల్యూహెచ్ఓకు డేటా సమర్పించేందుకు బదులు, ధనిక దేశాల్లో  రెగ్యులేటరీ వ్యవస్థల వెంబడి అత్యవసర వినియోగం అనుమతుల కోసం వెంపర్లాడుతున్నాయని అన్నారు.

ప్రపంచంలో అందరికీ సమాన ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ అందించాలన్న హామీ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడిందని టెడ్రోస్ అధనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.