గిద్దలూరు ఎమ్మెల్యేని ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: పవన్ కల్యాణ్

18-01-2021 Mon 19:08
  • ఆత్మహత్యకు పాల్పడిన బండ్ల వెంగయ్యనాయుడు
  • తన గ్రామంలో సమస్యలపై ఎమ్మెల్యేని నిలదీసిన యువకుడు
  • ఎమ్మెల్యే తీవ్రంగా దూషించాడన్న పవన్ కల్యాణ్
  • అనేక మార్గాల్లో బెదిరించారని ఆరోపణ
  • ఒత్తిళ్లతోనే ఆత్మహత్య చేసుకున్నాడని వివరణ
Pawan Kalyan reacts over party worker suicide incident

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించిన బండ్ల వెంగయ్యనాయుడు అనే జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గిద్దలూరు నియోజక వర్గంలోని కోనపల్లిలో పరిస్థితులపై వెంగయ్యనాయుడు ఎమ్మెల్యేని నిలదీశాడని పవన్ వివరించారు.

తమ ఊర్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని, రహదారి సౌకర్యంలేదని, ఇతర సౌకర్యాల ఏర్పాటు విషయం ఏమైంది? అని వెంగయ్యనాయుడు ఎమ్మెల్యేని ప్రశ్నించాడని, చివరికి అతను ప్రాణాలు తీసుకునే పరిస్థితులు రావడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు.

వెంగయ్యనాయుడు ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్థితిలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర పదజాలంతో దూషించారని, ఇదంతా సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో రాష్ట్ర ప్రజలు చూశారని వెల్లడించారు. వెంగయ్యనాయుడ్ని ప్రజల మధ్యనే బెదిరించిన ఎమ్మెల్యే ఆపై వివిధ మార్గాల్లో బెదిరించి ఒత్తిళ్లకు గురిచేసినట్టు తెలిసిందని పవన్ పేర్కొన్నారు. ప్రశ్నించిన యువకుడిని బెదిరింపులకు, ఒత్తిళ్లకు గురిచేసి ఆత్మహత్యకు పురిగొల్పిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.