ప్రగతి భవన్ మాఫియా డెన్ గా మారింది.. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం: అరవింద్

18-01-2021 Mon 18:02
  • కేటీఆర్ కు ఏ అర్హత ఉందని సీఎం చేస్తానంటున్నారు
  • ప్రొఫెసర్ జయశంకర్ ను కంట తడి పెట్టించిన వ్యక్తి కేసీఆర్
  • బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది
KCR family will go to jail says Arvind

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు ఏ అర్హత ఉందని ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారని ఆయన విమర్శించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత మళ్లీ పోటీ చేస్తారని తాను భావించలేదని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ను కంట తడి పెట్టించిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివిన అజ్ఞాని, సంస్కార హీనుడు కేసీఆర్ అని అన్నారు. పాస్ పోర్ట్ బ్రోకర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని దుయ్యబట్టారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హిందుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత కూడా టీఆర్ఎస్ కు లేదని అరవింద్ అన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తదుపరి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని అన్నారు. హిందువులపై దాడి చేస్తే ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించారు. ప్రగతి భవన్ మాఫియా డెన్ మాదిరి తయారయిందని అన్నారు. మైనింగ్ వ్యవహారంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. మైహోమ్ రామేశ్వరరావు ప్రాసిక్యూట్ కావడం కాయమని అన్నారు.