బాలీవుడ్ భారీ ప్రాజక్టులో తాప్సి!

18-01-2021 Mon 16:07
  • బాలీవుడ్ లో వరుసగా తాప్సి సినిమాలు 
  • రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్
  • కథానాయికగా ఛాన్స్ కొట్టేసిన తాప్సి  
Tapsi opposite Sharukh Khan

తాప్సి ఒకప్పుడు తెలుగు సినిమాలలో బిజీ కథానాయిక. ఆ తర్వాత తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసి, సత్తా చూపింది. అయితే, గత కొన్నాళ్లుగా దక్షిణాదిన ఆమె హవా తగ్గిపోయింది. దీంతో అమ్మడు బాలీవుడ్ మీదే దృష్టి పెట్టింది. అక్కడ తనకు అదృష్టం కలసి రావడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం తను బాలీవుడ్ లో బిజీ కథానాయిక.

ఈ క్రమంలో తాప్సికి మరో భారీ ఆఫర్ వచ్చింది. ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు లభించినట్టు తెలుస్తోంది. షారుఖ్ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో తాప్సిని కథానాయికగా తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ 'పఠాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక రాజ్ కుమార్ హిరాణి సినిమా ప్రారంభమవుతుంది.