Mamata Banerjee: నందిగ్రామ్ నా లక్కీ ప్లేస్... అక్కడ్నించే పోటీ చేస్తా: మమతా బెనర్జీ

  • వీలైతే భవానీపూర్ లోనూ బరిలో దిగుతానని వెల్లడి
  • సాధ్యంకాకపోతే మరొకరు పోటీచేస్తారన్న మమత
  • నందిగ్రామ్ ను పెద్దక్క గా, భవానీపూర్ ను చెల్లెలిగా అభివర్ణించిన వైనం
  • ఐదేళ్ల తర్వాత నందిగ్రామ్ సభలో పాల్గొన్న మమత
Mamata Banarjee says that she will contest from Nandigram

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. పదేళ్ల కిందట టీఎంసీకి అధికారం దక్కిన నేపథ్యంలో నాడు రైతు ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన  నందిగ్రామ్ నుంచి తాను బరిలో దిగుతున్నానని మమత తెలిపారు.

నందిగ్రామ్ తనకు బాగా కలిసొచ్చిన నియోజకవర్గం అని స్పష్టం చేశారు. ఐదేళ్ల తర్వాత నందిగ్రామ్ లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి నియోజకవర్గం నందిగ్రామ్ కావడంతో మమత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా, గత ఎన్నికల్లో మమత కోల్ కతాలోని భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. భవానీపూర్ ప్రజలు బాధపడొద్దని, వారికి మంచి అభ్యర్థిని ఇస్తానని అన్నారు. అయితే ఆ తర్వాత చేసిన వ్యాఖ్యల్లో... తాను నందిగ్రామ్, భవానీపూర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. నందిగ్రామ్ తనకు పెద్దక్క వంటిదని, భవానీపూర్ తన చిట్టిచెల్లెలు వంటిదని దీదీ అభివర్ణించారు. వీలైతే రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తానని, ఒకవేళ సాధ్యం కాకపోతే భవానీపూర్ లో మరొకరు బరిలో దిగుతారని ఆమె వివరించారు.

More Telugu News