ఇతర పార్టీల్లో చేరొచ్చంటూ మక్కళ్ మండ్రం సభ్యులకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్!

18-01-2021 Mon 15:34
  • అనారోగ్యంతో పార్టీ పెట్టలేనన్న రజనీకాంత్
  • తీవ్ర నిరాశకు గురైన రజనీ మక్కళ్ మండ్రం సభ్యులు
  • డీఎంకేలో చేరిన పలువురు సభ్యులు
  • కీలక ప్రకటన చేసిన రజనీకాంత్ టీమ్
Rajinikanth team gives nod to Makkal Mandam members to join other parties

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన సంవత్సరాది సందర్భంగా పార్టీ ప్రారంభిస్తాడంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లో పాల్గొనలేనని రజనీకాంత్ చెప్పడంతో ఇన్నాళ్లు రజనీ మక్కళ్ మండ్రం తరఫున అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా రజనీ మక్కళ్ మండ్రం నుంచి పలువురు నేతలు డీఎంకే పార్టీలో చేరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ బృందం నుంచి ఓ ప్రకటన వెలువడింది.

మక్కళ్ మండ్రం నుంచి నేతలు ఇతర పార్టీల్లో చేరడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, ఎవరికి ఇష్టమైన పార్టీలోకి వారు వెళ్లొచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఏ పార్టీలో ఉన్నా రజనీకాంత్ అభిమానులమన్న విషయాన్ని వారు మర్చిపోకూడదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వేసవిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. రజనీ ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని మరోపక్క ప్రచారం జరుగుతోంది.