పిల్లవాడు కాస్తా పెద్దోడయ్యాడు... సిరాజ్ పై సెహ్వాగ్ ప్రశంసలు

18-01-2021 Mon 14:55
  • బ్రిస్బేన్ టెస్టులో రాణించిన సిరాజ్
  • ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన వైనం
  • పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడన్న సెహ్వాగ్
  • కొత్తవాళ్లు విశేషంగా రాణిస్తున్నారంటూ ట్వీట్
Sehwag appreciates Mohammed Siraj abilities

టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో విశేషంగా రాణిస్తున్నాడు. ఇవాళ బ్రిస్బేన్ గబ్బా మైదానంలో ఐదు వికెట్లు తీసి క్రికెట్ పండితుల ప్రశంసలందుకుంటున్నాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా సిరాజ్ ను అభినందించకుండా ఉండలేకపోయాడు. ఈ టూర్ తో పిల్లోడు కాస్తా పెద్దోడు అయ్యాడంటూ తనదైన శైలిలో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

సిరాజ్ తన తొలి టెస్టు సిరీస్ లోనే భారత పేసర్లకు నేతృత్వం వహించేంతగా ఎదిగాడని కొనియాడాడు. టీమిండియా పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడని పొగడ్తల జల్లు కురిపించాడు. ఈ సిరీస్ లో కొత్త ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చాలాకాలం పాటు శిలాఫలకంలా నిలిచిపోతుందని, ట్రోఫీని నిలబెట్టుకుంటే కొత్త ఆటగాళ్ల శ్రమకు న్యాయం చేసినట్టవుతుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.