డీఎంకేలో చేరిన రజనీకాంత్ మక్కల్ మండ్రం నేతలు

18-01-2021 Mon 09:56
  • ఇతర పార్టీల్లో భవిష్యత్ వెతుక్కుంటున్న రజనీ మక్కల్ మండ్రం నేతలు
  • పార్టీ పెద్దలకు చెప్పే వచ్చామని వివరణ
  • త్వరలో మరికొందరు కూడా బయటకు వస్తారని వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో విజయం సాధిస్తామన్న స్టాలిన్
Rajinikanth Makkal Mandram leaders joined in DMK

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ పెడతారని ఆశగా ఎదురుచూస్తూ, ఆయన కోసం పనిచేసిన నేతలు ఇప్పుడు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ తలైవా ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇతర పార్టీల్లో భవిష్యత్తు వెతుక్కుంటున్నారు.

రజనీకాంత్‌ మక్కల్ మండ్రంకు చెందిన మూడు జిల్లాల కార్యదర్శులు నిన్న డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత స్టాలిన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొందరు నేతలు కూడా డీఎంకేలో చేరుతారని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. కృష్ణగిరి రజనీ మక్కల్ మండ్రం కార్యదర్శి మది అళగన్ శుక్రవారమే డీఎంకేలో చేరారు.

నిన్న డీఎంకేలో చేరిన మక్కల్ మండ్రం నేతల్లో తూత్తుకుడి జిల్లా కార్యదర్శి జోసఫ్ స్టాలిన్, రామనాథపురం కార్యదర్శి సెంథిల్ సెల్వానంద్, తేని కార్యదర్శి గణేశన్ ఉన్నారు. వీరంతా తమ మద్దతుదారులతో కలిసి డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో  234 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తాము రజనీ మక్కల్ మండ్రం పెద్దలతో చెప్పే బయటకు వచ్చామని డీఎంకేలో చేరిన నేతలు పేర్కొన్నారు.