2.24 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే, 447 మందిలో దుష్ప్రభావం కనిపించింది: కేంద్రం

17-01-2021 Sun 20:58
  • దేశంలో ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్
  • రెండోరోజు కూడా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ
  • ఇవాళ 6 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్
  • మీడియాకు వివరాలు తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
Union health ministry explains adverse incidents in corona immunization

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగింది. ఇవాళ ఆదివారం కూడా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 2,24,301 మందికి వ్యాక్సిన్ డోసులు అందించినట్టు వెల్లడించారు. అయితే వారిలో కేవలం 447 మందిలో దుష్ప్రభావం కనిపించిందని, ముగ్గుర్ని మాత్రమే ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు.

ఇవాళ ఆదివారం కావడంతో కేవలం 6 రాష్ట్రాల్లోనే వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 17,072 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని పేర్కొన్నారు.

భారత్ లో తొలి రోజున 2,07,229 మందికి టీకాలు వేశామని, అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో ఒకరోజులో వేసిన టీకాలకంటే ఇది ఎక్కువ అని, ప్రపంచ రికార్డు అని  మనోహర్ అగ్నాని వెల్లడించారు.