Bowen Pally Kidnap: కిడ్నాప్ కేసులో అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి కీలకం: పోలీసులు

Hyderabad police gives details about Bowenpally kidnap case
  • సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారం
  • భూమా అఖిలప్రియ అరెస్ట్
  • మీడియా సమావేశం నిర్వహించిన పోలీసులు
  • భార్గవరూమ్ స్కూల్లో ప్లాన్ చేశారని వెల్లడి
బోయిన్ పల్లి కిడ్నాప్ వివాదంలో పోలీసు దర్యాప్తు పురోగతిపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో కొత్తగా 15 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా మాదాల సిద్ధార్థ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఈ కిడ్నాప్ కోసం సిద్ధార్థ్ 20 మంది మనుషులను పంపించాడని, ఓ స్విఫ్ట్ డిజైర్ కారును కూడా సమకూర్చాడని పోలీసులు తెలిపారు. సిద్ధార్థ్ ఓ ఈవెంట్ మేనేజర్ అని పేర్కొన్నారు. సిద్ధార్థ్ కు అత్యంత సన్నిహితుడే మాదాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను అని వెల్లడించారు.

ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ, భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి కీలకం అని వివరించారు. యూసుఫ్ గూడలోని భార్గవరామ్ కు చెందిన స్కూల్లో ఈ కిడ్నాప్ కు పథక రచన చేశారని, రూ.,5 లక్షల డీల్ లో భాగంగా సిద్ధార్థ్ కు రూ.75 వేలు అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. యూసుఫ్ గూడలోనే నకిలీ పోలీసు దుస్తులు, ఐటీ అధికారుల దుస్తులు కొనుగోలు చేశారని వివరించారు. భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్లతో స్టాంప్ పేపర్లు కూడా సిద్ధంగా ఉంచుకున్నారని తెలిపారు.

జనవరి 5న బాధితులను వారి ఇంటి వద్ద నుంచి సంపత్, బాలచెన్నయ్య అనే వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారిని మొయినాబాద్ ఫాంహౌస్ కు తరలించారని చెప్పారు. ఆపై ముగ్గురు బాధితులను సన్ సిటీ వద్ద వదిలేశారని, ఈ ఘటనలో ఓ ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఫేక్ నెంబరుతో ఆ వాహనాన్ని ఉపయోగించారని, ఆ ఇన్నోవా వాహనం భార్గవరామ్ తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తించామని వివరించారు. ఈ కిడ్నాప్ కోసం మొత్తం 5 వాహనాలు ఉపయోగించారని, వాటిలో ఒక వాహనాన్ని జగత్ విఖ్యాత్ రెడ్డి, మరో వాహనాన్ని మాదాల శ్రీను డ్రైవింగ్ చేశారని వెల్లడించారు. గుంటూరు శ్రీను ఇన్నోవా కారులో ప్రయాణించాడని తెలిపారు.
Bowen Pally Kidnap
Police
Bhuma Akhila Priya
Hyderabad
Telangana

More Telugu News