Corona Virus: ఐస్ క్రీమ్ లో కరోనా వైరస్ క్రిములు... చైనాలో కలకలం!

  • చైనాలో మళ్లీ కరోనా కేసులు
  • టియాన్జిన్ నగరంలో ఐస్ క్రీమ్ కంపెనీ మూసివేత
  • మార్కెట్లో పంపిణీ చేసిన ఐస్ క్రీముల ఉపసంహరణ
  • కంపెనీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్
Corona virus found on Ice Cream in China

కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా అప్రదిష్ఠ మూటగట్టుకున్న చైనాలో మరోసారి వైరస్ వ్యాప్తి అధికమవుతోంది. తాజాగా, చైనాలో టియాన్జిన్ నగరంలో ఐస్ క్రీమ్ లో కరోనా వైరస్ క్రిములను గుర్తించారు. దాంతో ఆ బ్యాచ్ కు చెందిన ఐస్ క్రీమ్ బాక్సులన్నింటినీ కంపెనీ వెనక్కి తెప్పిస్తోంది. ఈ పరిణామంతో టియాన్జిన్ లోని దఖియావోదావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్ లో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిస్థితులు చక్కబడే వరకు కంపెనీ మూతవేశారు. దఖియావోదావో ఫుడ్ కంపెనీలో ఉద్యోగులు కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో అధికార వర్గాలు దీనిపై ఆంక్షలు విధించాయి.

కాగా, ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఐస్ క్రీమ్ తిని కరోనా బారినపడినట్టు ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. ఈ కంపెనీ తాజాగా 29 వేల ఐస్ క్రీమ్ కార్టన్లను అమ్మకానికి సిద్ధం చేసింది. టియాన్జిన్ లో విక్రయించిన 390 కార్టన్లను గుర్తించి వెనక్కి తీసుకున్నారు. కాగా, దఖియావోదావో ఫుడ్ కంపెనీ తమ ఐస్ క్రీముల్లో ఉపయోగించేందుకు న్యూజిలాండ్, ఉక్రెయిన్ నుంచి పాల ఉత్పత్తులును దిగుమతి చేసుకుంటుంది. వీటి ద్వారా కరోనా వైరస్ క్రిములు ఐస్ క్రీముల్లోకి చేరి ఉంటాయన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

More Telugu News