జర్మనీ చాన్స్​ లర్​ రేసులో ఆర్మిన్​ లాషెట్​.. అధికార సీడీయూ చీఫ్​ గా ఎన్నిక

17-01-2021 Sun 14:53
  • 1,001 ఓట్లలో 521 ఓట్లు ఆయనకే
  • 466 ఓట్లతో రెండో స్థానంలో ఫ్రెడ్రిక్ మెర్జ్
  • ఈ ఏడాది సెప్టెంబర్ లో జర్మనీకి ఎన్నికలు
Armin Laschet elected leader of Merkel CDU party
జర్మనీ అధికార పార్టీ క్రిస్టియన్ డెమొక్రాట్స్ యూనియన్ (సీడీయూ)కు కొత్త నాయకుడు వచ్చేశారు. సెంట్రిస్ట్ ఆర్మిన్ లాషెట్ ను కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం నార్త్ రైన్ వెస్ట్ ఫాలియా రాష్ట్రానికి అధిపతిగా ఉన్న ఆయన.. తన ఇద్దరు ప్రత్యర్థులపై విజయం సాధించి సీడీయూ లీడర్ గా అవతరించారు. దీంతో మెర్కెల్ తర్వాత జర్మనీ చాన్స్ లర్  రేసులో ఆయనకు లైన్ క్లియర్ అయింది.

దాదాపు 16 ఏళ్లపాటు ఏకబిగిన జర్మనీని పాలించిన ఏంజెలా మెర్కెల్.. ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం సీడీయూకు కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను మొదలు పెట్టారు. 1,001 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. అందులో 521 ఓట్లు 59 ఏళ్ల లాషెట్ కు పడ్డాయి. 466 ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన ఫ్రెడ్రిక్ మెర్జ్.. ఓటమి పాలయ్యారు. రేసులో ఉన్న నార్బర్ట్ రోటెన్ కు అతి తక్కువ ఓట్లు పడ్డాయి.

ఈ గెలుపుతో ప్రస్తుతం సీడీయూ చైర్మన్ గా ఉన్న అనెగ్రెట్ క్రాంప్ కారెన్బార్ స్థానాన్ని లాషెట్ ఆక్రమించనున్నారు. లాషెట్ కు అసిస్టెంట్ గా ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ నియమితులయ్యారు. సీడీయూ బవేరియా సిస్టర్ పార్టీ సీఎస్యూకు చెందిన మార్కస్ సోడర్  మరో అసిస్టెంట్ గా ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో జర్మనీకి సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.