బైడెన్​ టీంలో 20 మంది భారతీయులు.. 13 మంది మహిళలే!

17-01-2021 Sun 14:36
  • శ్వేత సౌధంలో కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్
  • మరో మూడు రోజుల్లో అధ్యక్షుడిగా ప్రమాణం
  • ఇద్దరు కశ్మీరీ మహిళలకూ ముఖ్యమైన పదవులు
20 Indian Americans Nominated For Key Roles In Biden Harris Administration

అమెరికాలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. తన అధికార గణంలో 20 మంది భారతీయులకు చోటు కల్పించారు. అందులో 13 మంది మహిళలే ఉండడం మరో విశేషం. అందరికీ శ్వేత సౌధంలో కీలక పదవులు అప్పగించారు. వాస్తవానికి అమెరికా జనాభాలో భారతీయ అమెరికన్ల వాటా కేవలం ఒక్క శాతం. అలాంటిది ఒకేసారి ఇంత మంది ఇండియన్ అమెరికన్లకు ఆయన అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.

ఈ నెల 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా చరిత్రలో తొలిసారి మహిళా వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ కూడా ప్రమాణం చేయనున్నారు. అంతేగాకుండా ప్రమాణ స్వీకారానికి ముందే చాలా మంది ఇండియన్ అమెరికన్లకు శ్వేత సౌధంలో అధికార బాధ్యతలు అప్పగించడమూ ఇదే తొలిసారి.

ఈ లిస్టులో నీరా టాండన్, డాక్టర్ వివేక్ మూర్తి ప్రథమ స్థానంలో ఉంటారు. నీరా టాండన్ ను శ్వేత సౌధం నిర్వహణ, బడ్జెట్ డైరెక్టర్ గా బైడెన్ నియమించారు. అమెరికా సర్జన్ జనరల్ గా వివేక్ మూర్తికి బాధ్యతలు అప్పగించారు. వనితా గుప్తాను న్యాయశాఖ అసోసియేట్ అటార్నీ జనరల్ గా నియమించారు.

అమెరికా ప్రథమ మహిళ కాబోతున్న డాక్టర్ జిల్ బైడెన్ కు విధాన డైరెక్టర్ గా మాలా ఎడిగాను, ప్రథమ మహిళ కార్యాలయానికి డిజిటల్ డైరెక్టర్ గా గరిమా వర్మను నియమించారు. జిల్ కు వ్యక్తిగత డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రినా సింగ్ కు బాధ్యతలు అప్పగించారు.

ఇద్దరు కశ్మీరీ మహిళలనూ తన టీంలో తీసుకున్నారు. పార్ట్ నర్ షిప్స్ మేనేజర్ గా ఆయిషా షాను, జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్ గా సమీరా ఫాజిలీని ఎంపిక చేసుకున్నారు. ఆర్థిక మండలికే మరో డిప్యూటీ డైరెక్టర్ గా భారత్ మూర్తిని నియమించారు. ఒబామా హయాంలోనూ శ్వేత సౌధంలో పనిచేసిన గౌతమ్ రాఘవన్.. బైడెన్ టీంలోనూ చోటు సంపాదించారు. అధ్యక్షుడి వ్యక్తిగత సిబ్బంది కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్ గా ఆయన్ను నియమించారు.

ఇక అధ్యక్షుడి ప్రసంగాన్ని రాసిచ్చేందుకు ఏర్పాటు చేసిన స్పీచ్ రైటింగ్ కు డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి వినయ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ప్రెసిడెంట్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా యువ వేదాంత్ పటేల్ ఎంపికయ్యారు. కీలకమైన జాతీయ భద్రతా మండలిలో మరో ముగ్గురు భారతీయులకు చోటిచ్చారు. టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సీనియర్ డైరెక్టర్ గా తరుణ్ ఛాబ్రా, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ గా సుమోనా గుహ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కో ఆర్డినేటర్ గా శాంతి కళథిల్ ను నియమించారు.

పర్యావరణ విధానాలపై సీనియర్ సలహాదారుగా సోనియా అగర్వాల్ ను ఎంపిక చేశారు. విదుర్ శర్మను కొవిడ్ 19 టెస్టింగ్ రెస్పాన్స్ టీమ్ కు విధాన సలహాదారుగా నియమించారు. వైట్ హౌస్ అసోసియేట్ న్యాయవాదిగా నేహా గుప్తా, డిప్యూటీ అసోసియేట్ న్యాయవాదిగా రీమా షాకు అవకాశమిచ్చారు.