బ్రిస్బేన్ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట... రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 21/0

17-01-2021 Sun 13:37
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ 336 ఆలౌట్
  • ఆదుకున్న సుందర్, శార్దూల్ ఠాకూర్
  • ఏడో వికెట్ కు 123 పరుగులు జోడించిన వైనం
  • హేజెల్ వుడ్ కు 5 వికెట్లు
  • ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 54 పరుగులు
End of third day play in Brisbane Test between India and Australia

బ్రిస్బేన్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ఆఖరుకు ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 22 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 20 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మార్కస్ హారిస్ 14 బంతులాడి 1 పరుగు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 54 పరుగులకు చేరింది. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండడంతో ఫలితం ఆసక్తికరంగా ఉండే అవకాశాలున్నాయి.

అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 62/2తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 336 పరుగులకు ఆలౌట్ అయింది. రహానే 37, పుజారా 25, మయాంక్ అగర్వాల్ 38 పరుగులు సాధించినా, భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమయ్యారు. మూడో రోజు ఆటలో హైలైట్ అంటే వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ ల భాగస్వామ్యమేనని చెప్పాలి. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ కుప్పకూలే ప్రమాదం నుంచి తప్పించుకుని, మ్యాచ్ లో సురక్షితమైన స్థానంలో నిలిచిందంటే అది వీరిద్దరి చలవే.

సుందర్, ఠాకూర్ జోడీ ఏడో వికెట్ కు 123 పరుగులు జోడించి జట్టును ఆదుకుంది. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న సుందర్ 62 పరుగులు సాధించి స్టార్క్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. సుందర్ అవుటైన తర్వాత టీమిండియా ఎక్కువ సేపు నిలవలేకపోయింది. అంతకుముందు శార్దూల్ ఠాకూర్ 67 పరుగులు సాధించి కమ్మిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. చివర్లో టెయిలెండర్లను ఆసీస్ పేసర్ హేజెల్ వుడ్ అవుట్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది.

కంగారూ బౌలర్లలో హేజెల్ వుడ్ కు 5 వికెట్లు దక్కాయి. స్టార్క్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు తీశారు. కెరీర్ లో 100వ టెస్టు ఆడుతున్న ఆఫ్ స్పినర్ నాథన్ లైయన్ కు ఒక వికెట్ దక్కింది. కాగా, ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.