13 ఏళ్ల బాలికపై 9 మంది అఘాయిత్యం.. ట్రక్కు మార్చి ట్రక్కులో అత్యాచారం

17-01-2021 Sun 12:31
  • రోజంతా చిత్రవధ చేసిన దుర్మార్గులు
  • ఏడుగురి అరెస్ట్.. ఇద్దరి కోసం గాలింపు
  • మధ్యప్రదేశ్ లోని ఉమేరియాలో ఘటన
13 year old gang raped by 9 men thrice in 24 hours in Madhya Pradesh

8 మంది మృగాలు.. 24 గంటలు.. మూడేసి సార్లు.. ఓ 13 ఏళ్ల అమ్మాయిని చిత్రవధ చేశారు. అత్యాచారానికి పాల్పడ్డారు. వదిలిపెట్టాలంటూ బాలిక ఆ దుర్మార్గుల కాళ్లావేళ్లా పడినా కనికరం కూడా చూపలేదు. ట్రక్కు మార్చి ట్రక్కులోకి ఎక్కించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. రోడ్డు మీద వదిలేసి పరారయ్యారు. రోడ్డు మీద కనపడిన వాళ్లను సాయమడిగినా ఎవరూ స్పందించలేదు. సాయం చేసినట్టే చేసిన ఓ ట్రక్కు డ్రైవర్.. తానూ మృగాన్నేనని నిరూపించాడు. అతడూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను వదిలేసి పరారయ్యాడు. మొత్తంగా 9 మంది ఓ బాలిక జీవితంతో పైశాచిక ఆనందం పొందారు.

ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉమేరియాలో జనవరి 11–12 మధ్య జరిగింది. ఈ ఘటనలో ఇంకో షాకింగ్ విషయం.. జనవరి 4నే ఆ నిందితుల్లో నలుగురు బాధిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఉమేరియాలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. ఈ నెల 11న షాపునకు వెళ్లింది. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ఒంటరిగా వెళుతున్న బాలికను కిడ్నాప్ చేశారు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ట్రక్కులోనే బందీగా ఉంచి ఓ ధాబాకు తీసుకెళ్లారు. అక్కడ మరో ఐదుగురు ఆ ఇద్దరితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ధాబా యజమాని కూడా కనికరం చూపలేదు. తర్వాత ట్రక్కులోకి ఎక్కించి ఆ రోజు రాత్రంతా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. తెల్లారి వేరే ట్రక్కులోకి ఎక్కించి ఎటెటో తిప్పారు.

వదిలిపెట్టాలని బాలిక ప్రాధేయపడినా వినిపించుకోలేదు. మళ్లీ అత్యాచారానికి పాల్పడి.. రోడ్డు మీద వదిలేసి పరారయ్యారు. అక్కడితో ఆమె కష్టాలు తీరలేదు. సాయం చేయాలంటూ దారిన వచ్చిపోయే వారిని కోరింది. ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఓ ట్రక్కు డ్రైవర్ ఆమెను ట్రక్కులో ఎక్కించుకున్నాడు. అతడూ బాధితురాలిపై అత్యాచారం చేశాడు. దారిలో వదిలేసి పారిపోయాడు.

రోడ్డు మీద పోలీసులు కనిపించడంతో వారి దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది బాధిత బాలిక. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. దాదాపు 20 గంటల తర్వాత నోరు విప్పిన బాలిక జరిగిందంతా వివరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మానసికంగా చాలా కుంగిపోయిందని చెప్పారు.