బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన బండి సంజ‌య్‌

17-01-2021 Sun 11:48
  • సికింద్రాబాద్ లోని రాజ‌రాజేశ్వ‌రీ గార్డెన్స్ లో స‌మావేశం
  • బీజేపీ తీర్మానాలు
  • కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో పేద‌లు వైద్యం చేయించుకోలేరు
  • ‌ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌రైన స‌దుపాయాలు లేవు
  • ప్రాజెక్టుల పేరుతో అవినీతి: బండి సంజ‌య్
bandi sanjay slams trs government

సికింద్రాబాద్ లోని రాజ‌రాజేశ్వ‌రీ గార్డెన్స్ లో బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశం కొన‌సాగుతోంది. తెలంగాణ‌లో కీల‌క అంశాల‌పై బీజేపీ తీర్మానాలు చేయ‌నుంది. ఈ సంద‌ర్భంగా బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ త‌మ పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న‌ మాట్లాడుతూ... బీజేపీ కార్య‌క‌ర్త‌లు గ‌డ‌ప గ‌డ‌ప తిరిగి క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించారని తెలిపారు. లాక్‌డౌన్‌లో ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా వారు సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని తెలిపారు.

హైద‌రాబాద్‌లో సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న న‌లుగురు కార్య‌క‌ర్త‌లు క‌రోనాతో మృతి చెందార‌ని చెప్పారు. తెలంగాణ‌లో పేద ప్ర‌జ‌ల‌కు వైద్య స‌దుపాయాలు అంద‌ట్లేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. వారు కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో వైద్యం చేయించుకోలేక‌, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌రైన స‌దుపాయాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు.

చాలా మంది పేద ప్ర‌జ‌లు క‌రోనా వేళ ప్రాణాలు కోల్పోయార‌ని అన్నారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేసింద‌ని చెప్పారు. క‌రోనా కేసులు, మృతుల సంఖ్య‌పై పార‌ద‌ర్శ‌కంగా వివ‌రాలు అందించ‌లేద‌ని తెలిపారు.

త‌మ పార్టీ నేత‌లు ఆసుప‌త్రుల్లో ప‌ర్య‌టించి అక్క‌డి స‌దుపాయాల‌ను పరిశీలించార‌ని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. తెలంగాణ‌లో బీజేపీకి అధికారం ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. కేసీఆర్ సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టే స‌మ‌యానికి తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా ఉంద‌ని, ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింద‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు.

కేంద్రంలో ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంద‌ని తెలిపారు. అయోధ్య‌లో రామ మంది నిర్మాణ క‌ల బీజేపీతోనే సాకార‌మైంద‌ని ఆయ‌న అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని విమ‌ర్శించారు.