నాలుగో టెస్టులో సిక్స‌ర్ తో శార్దూల్ అర్ధ శ‌త‌కం.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ కూడా హాఫ్ సెంచ‌రీ

17-01-2021 Sun 11:31
  • ఏడు, ఎనిమిదో స్థానాల్లో క్రీజులోకి వ‌చ్చిన  సుంద‌ర్, శార్దూల్
  • క్రీజులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ 53, శార్దూల్ 64  
  • టీమిండియా స్కోరు 100 ఓవ‌ర్ల నాటికి 305/6
  • తొలి ఇన్నింగ్సు లో ఆస్ట్రేలియా 369 ప‌రుగులు  
India score in fourth test 305

బ్రిస్బేన్ లో జ‌రుగుతోన్న భార‌త్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ పోరాడుతోంది.  టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. ఏడు, ఎనిమిదో స్థానాల్లో క్రీజులోకి వ‌చ్చిన వాషింగ్ట‌న్ సుంద‌ర్, శార్దూల్ ఠాకూర్ మాత్రం చ‌క్క‌గా రాణిస్తున్నారు.

ఇద్ద‌రూ అర్ధ సెంచ‌రీలు పూర్తి చేసుకుని టీమిండియాకు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం క్రీజులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ 53, శార్దూల్ ఠాకూర్ 64 ప‌రుగుల‌తో ఉన్నారు. టెస్టుల్లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ కి ఇది తొలి అర్ధ శ‌త‌కం. ఆడుతోన్న మొట్ట‌మొద‌టి టెస్టు మ్యాచులోనే ఆయ‌న అర్ధ శ‌త‌కం సాధించాడు. కాగా, శార్దూల్ సిక్స‌ర్ తో అర్ధ శ‌త‌కం చేయ‌డం గ‌మ‌నార్హం. వారిద్ద‌రు రాణిస్తుండ‌డంతో టిమిండియా స్కోరు 100 ఓవ‌ర్ల నాటికి 305/6 గా ఉంది.

టీమిండియాలో రోహిత్ శర్మ 44, శుభమన్ గిల్ 7, ఛటేశ్వర్ పుజారా 25, అజింక్యా రహానే 37, మయాంక్ అగర్వాల్ 38, పంత్ 23 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జోష్  కు మూడు, స్టార్క్, కమిన్స్, లైయ‌న్ లకు తలో వికెట్ ద‌క్కాయి. తొలి ఇన్నింగ్సు లో ఆస్ట్రేలియా 369 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే.