Republic TV: 'ఏదో అతిపెద్ద ఘటన జరగబోతోంది'...: అర్నబ్ గోస్వామిపై అదనపు చార్జ్ షీట్ లో వాట్సాప్ మెసేజ్ ల ప్రస్తావన!

  • బాలాకోట్ దాడుల గురించి ముందుగానే ప్రస్తావన
  • అందుకు ముందే రాజ్ నాథ్ తో అర్నబ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
  • దాడుల గురించి పార్థో దాస్ గుప్తాతో వాట్సాప్ సంభాషణ
Days before Balakot IAF Struje Arnab told in Watsapp to BARC Ex Chief

'ఏదో అతిపెద్ద ఘటన జరగబోతోంది'...: అర్నబ్ గోస్వామిపై అదనపు చార్జ్ షీట్ లో వాట్సాప్ మెసేజ్ ల ప్రస్తావన!
టీఆర్పీ టాంపరింగ్ విషయంలో పోలీసు కేసును ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై పోలీసులు దాఖలు చేసిన అదనపు చార్జ్ షీట్ లో ఓ ఆసక్తికర విషయం ప్రస్తావనకు వచ్చింది. భారత వాయుసేన బాలాకోట్ దాడులకు దిగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు బార్క్ (బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తాతో అర్నబ్ వాట్సాప్ ద్వారా సంభాషించారు. ఈ సంభాషణల్లో 'ఏదో అతిపెద్ద ఘటన జరగబోతోంది' అని అర్నబ్ తెలిపారు. చాలా రహస్యంగా సైనిక చర్య జరుగనుందని అభిప్రాయపడ్డారు. టీఆర్పీ టాంపరింగ్ స్కామ్ లో ముంబై పోలీసులు తాజాగా, ఈ సంభాషణ వివరాలతో కూడిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను దాఖలు చేశారు.

2019, ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాపై ఉగ్రదాడికి దిగిన టెర్రరిస్టులు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు తీయగా, దీనికి ప్రతిగా, అదే నెల 26వ తేదీన భారత వాయుసేన బాలాకోట్ పట్టణంలోని జైషే మొహమ్మద్ శిక్షణా శిబిరంపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరగడానికి మూడు రోజుల ముందు... అంటే ఫిబ్రవరి 23న రాత్రి 10 గంటల ప్రాంతంలో గోస్వామి, దాస్ గుప్తాల మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగింది.

పుల్వామా దాడి జరిగిన తరువాత నాడు హోమ్ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ తో తొలి ఇంటర్వ్యూను సైతం అర్నబ్ గోస్వామి తీసుకుని, తమ రిపబ్లిక్ చానెల్ లో ప్రసారం చేశారని పోలీసులు తమ చార్జ్ షీట్ లో గుర్తు చేశారు. దాని తరువాతే దాస్ గుప్తాతో చాటింగ్ జరిగింది. "ఏదో పెద్ద ఘటన జరుగనుంది" అని అర్నబ్ తెలుపగా, "దావూద్?" అని దాస్ గుప్తా ప్రశ్నించారు. "కాదు సర్... పాకిస్తాన్. ఈ సమయంలో భారీ ప్రతీకార చర్యే ఉండబోతోంది" అని దానికి అర్నబ్ సమాధానం ఇచ్చారు. "ఈ సమయంలో ఆ పెద్ద మనిషికి ఇది చాలా మంచి చేస్తుంది" అని దాస్ గుప్తా బదులిచ్చారు.

ఈ వాట్సాప్ సంభాషణ జరిగే సమయానికి సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉన్నాయి. ఆపై దాస్ గుప్తా మరింత స్పష్టత కోసం ప్రశ్నించినా, గోస్వామి మాత్రం పూర్తి వివరాలు వెల్లడించకుండా, సాధారణ దాడులకన్నా పెద్ద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని, అది ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుందన్న నమ్మకం పెద్దల్లో ఉందని గోస్వామి బదులిచ్చారు.

ఇక ఈ చాటింగ్ పై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించనప్పటికీ, ఆ పార్టీ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది, అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, ప్రభుత్వంలోని పెద్దలు కొందరు రహస్యంగా ఉంచాల్సిన నిర్ణయాలను బహిర్గతం చేస్తున్నారని పోలీసుల చార్జ్ షీట్ ద్వారా తెలిసిందని వ్యాఖ్యానించారు. ఇది సైనికుల మనోభావాలను దెబ్బతీసే ఘటనని, తమకు నచ్చిన టీవీ చానెళ్ల టీఆర్పీ రేటింగ్ లను ప్రభుత్వ పెద్దలు కావాలని పెంచుతున్నారని ఆరోపించారు.

More Telugu News