Corona Virus: మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

Maharashtra and Odisa Halts Vaccination
  • కొవిన్ యాప్ లో సాంకేతిక లోపాలు
  • పలు రాష్ట్రాల్లో ఇదే సమస్య
  • ఒడిశాలో నేడు, మహారాష్ట్రలో రేపు పునరుద్ధరణ
కొవిన్ యాప్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో, రాష్ట్రవ్యాప్తంగా నిన్న మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేస్తున్నామని, 18వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. నిన్న తొలిరోజున వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగానే, కొవిన్ యాప్ లోని లోపాలు బహిర్గతమయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో కొవిన్ వెబ్ సైట్ తో ఉన్న కనెక్షన్ తెగిపోయింది.

ఇదే సమయంలో కొందరికి రియాక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. అంతకుముందు ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో ఎటువంటి సమస్యలూ రాలేదని వారు తెలిపారు. ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ లో సైతం ఇదే తరహా సమస్య ఏర్పడింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు అప్ లోడ్ కాలేదు. తమిళనాడులోని నీలగిరిలో సైతం పలువురికి వ్యాక్సినేషన్ ఎకనాలెడ్జ్ మెంట్ ను అధికారులు ఇవ్వలేకపోయారు.

కొవిన్ యాప్ ద్వారా వెళ్లిన మెసేజ్ లు టీకా తీసుకున్న వారికి అందడం లేదని పంజాబ్ అధికారులు కూడా ఆరోపించారు.హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ వెబ్ సైట్ మొరాయించింది. అయినా తాము టీకా ఇచ్చే ప్రక్రియను ఆపడం లేదని ఆయా రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. ఒడిశాలోనూ వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఒక రోజు ఆలస్యంగా టీకాను ఇస్తామని ఒడిశా అధికారులు వెల్లడించారు. కొవిన్ యాప్ సమస్యలను పరిష్కరించిన తరువాతే వ్యాక్సిన్ ఇస్తామని, తొలి దశలో మొత్తం 3.28 లక్షల మందికి టీకా ఇస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రదీప్త మోహపాత్ర వెల్లడించారు.

Corona Virus
Vaccine
CoWin

More Telugu News