Borris Johnson: కార్నిష్ రిసార్ట్ కు రండి... జీ7 దేశాల అధినేతలకు బ్రిటన్ ఆహ్వానం!

Britain Welcomes G 7 to Cornish Resort for Meeting
  • జూన్ లో సమావేశాలు జరపాలని భావిస్తున్న బ్రిటన్
  • కరోనా తరువాతి ఆర్థిక వృద్ధిపైనే ప్రధాన చర్చ
  • ఇండియా, ఆస్ట్రేలియాలకూ ఆహ్వానం పలికిన జాన్సన్
దాదాపు రెండేళ్ల తరువాత జీ-7 దేశాల సమావేశానికి మార్గం సుగమమైంది. వచ్చే జూన్ లో సముద్ర తీరంపై ఉన్న కార్నిష్ రిసార్ట్ లో ఈ సమావేశాలను జరపాలని భావిస్తున్న బ్రిటన్, అభివృద్ధి చెందిన 7 దేశాల అధినేతలనూ ఆహ్వానించింది. కరోనా మహమ్మారి తదుపరి ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాతావరణ పరిస్థితులపై చర్చించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు సాగనున్నాయి.

ఇదే సమయంలో స్వేచ్ఛా వాణిజ్య విధానంపైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, 7 దేశాల అధినేతలనూ కార్నిష్ రిసార్ట్ కు ఆహ్వానించారు. "మన తరంలో చూసిన మహమ్మారుల్లో కరోనా అత్యధిక ప్రభావాన్ని చూపించి, తీరని నష్టాన్ని మిగిల్చిందనడంలో సందేహం లేదు. ఈ మహమ్మారి తెచ్చిన సవాళ్లను అధిగమిస్తూ, మెరుగైన భవిష్యత్తు దిశగా ముందుకు సాగేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. అందుకు ఇదే సరైన సమయం" అని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, కరోనా కారణంగా యూరప్ దేశాల్లో బ్రిటన్ అత్యధికంగా నష్టపోయిందన్న సంగతి తెలిసిందే. మరణాల రేటు కూడా బ్రిటన్ లోనే అత్యధికం. ఇప్పటివరకూ దాదాపు 88 వేల మందికి పైగా మరణించారు. కరోనా మూడో దశ కూడా బ్రిటన్ ను కుదేలు చేసింది. ప్రస్తుతం వైరస్ కారణంగా రోజుకు సుమారు 1000కిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రజలకు ఇచ్చేందుకు తొలుత అంగీకారం తెలిపిన దేశంగానూ బ్రిటన్ నిలిచింది.

వాస్తవానికి జీ7 సమావేశాలు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన గత సంవత్సరం జరగాల్సి వుంది. అయితే, కరోనా కారణంగా ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. బ్రిటన్ తో పాటు జర్మనీ, ఫ్రాన్స్, యూఎస్, ఇటలీ, జపాన్, కెనడాలు జీ7 దేశాల జాబితాలో ఉండగా, 2019లో ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో చివరి సమావేశం జరిగింది. ఆపై గత సంవత్సరం మీటింగ్ వాయిదా పడగా, ఈ సంవత్సరంలో నిర్వహించాలని బ్రిటన్ భావిస్తోంది. ఈ సమావేశాలు ముగిసేంత వరకూ బ్రిటన్ ప్రధాని మరో దేశాన్ని సందర్శించే అవకాశాలు లేవని 'ది సండే టెలిగ్రాఫ్' పేర్కొంది. అయితే, కెనడాకు మాత్రం ఆయన వెళ్లి రావచ్చని వెల్లడించింది.

ఇదిలావుండగా, పేరుకు జీ-7 దేశాల అధినేతల సమావేశమే అయినప్పటికీ, ఈ సమావేశాలకు ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియాలను సైతం బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు. ఈ దేశాలు ప్రాతినిధ్యం లేకుండా తీసుకునే ఏ నిర్ణయమూ ప్రపంచ స్థాయిలో ఉండబోదని ఆయన భావిస్తుండటమే ఇందుకు కారణం.

Borris Johnson
Britain
G-7
India
Meeting

More Telugu News