హెచ్1బీ వీసాల అంశంలో మరో కఠిన నిర్ణయం అమలు చేస్తున్న ట్రంప్ సర్కారు

16-01-2021 Sat 21:04
  • ఎల్సీఏ ఫైలింగ్ ను విస్తరించిన అమెరికా హోంశాఖ
  • కస్టమర్ కంపెనీలకు కూడా నిబంధన వర్తింపు
  • ఆమోదం తెలిపిన ట్రంప్
  • 180 రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త నిబంధన
Trump government extends LCA Filing to customer companies

హెచ్1బీ వీసాల అంశంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంస్థ-ఉద్యోగి మధ్య సంబంధాన్ని పునర్నిర్వచిస్తూ అమెరికా హోంమంత్రిత్వ శాఖ తుది ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై, హెచ్1బీ వీసాలపై నిపుణులను ఉద్యోగ విధుల్లోకి తీసుకునే ప్రధాన కంపెనీల కస్టమర్ సంస్థలు కూడా లేబర్ కండిషన్ అప్లికేషన్స్ (ఎల్సీఏ), హెచ్1బీ అప్లికేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రధాన ఉద్యోగ సంస్థ ఎల్సీఏ, హెచ్1బీ అప్లికేషన్లు దాఖలు చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఆ నిబంధనను వాటి కస్టమర్ కంపెనీలకు కూడా వర్తింపజేయాలన్న ప్రతిపాదనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదముద్ర వేశారు.

ఈ తాజా ఉత్తర్వులు మరో 180 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. జూలై 14న, ఆ తర్వాత దాఖలయ్యే దరఖాస్తులకు, హెచ్1బీ వీసాల పొడిగింపు అభ్యర్థనలకు ఇది వర్తించనుంది. ఈ నిర్ణయం ప్రధానంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ సంస్థలు, వాటి కస్టమర్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.