సహజీవనం చేస్తున్న ప్రియురాలిని హత్య చేసి శవాన్ని గోడలో దాచిన వైనం!

16-01-2021 Sat 19:45
  • మహారాష్ట్రలో ఘోరం
  • పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు
  • హత్య చేసి శవాన్ని మాయం చేసిన ప్రియుడు
  • గోడలో బయటపడిన అస్థిపంజరం
  • పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న నిందితుడు
Man kills girl friend and hide her body in a wall

మహారాష్ట్ర పాల్ గఢ్ జిల్లా వనగామ్ లో ఓ ఘోర కృత్యం వెలుగుచూసింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని గోడలో దాచిన వైనం అందరినీ నివ్వెరపరిచింది. ఓ వ్యక్తి గత ఐదేళ్లుగా సదరు మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె వయసు 32 సంవత్సరాలు. అయితే కొంతకాలంగా ఆ మహిళ కనిపించకపోవడంతో బంధువులు ఆ వ్యక్తిని నిలదీశారు. ఆమె గుజరాత్ వెళ్లిందని వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం వెల్లడైంది. ఆమె పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతోందని, అందుకే చంపేశానని తెలిపాడు. మృతదేహాన్ని ఏంచేశావని ప్రశ్నించగా, ఓ గోడలో దాచానని చెప్పాడు. దాంతో ఆ గోడను పగులగొట్టి చూడగా, మహిళ అస్థిపంజరం బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.