నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం

16-01-2021 Sat 18:18
  • ఆసీస్ తో జరిగిన టెస్టులో రోహిత్ ఔటైన తీరుపై విమర్శలు
  • ఆ షాట్ ఆడినందుకు బాధ పడటం లేదన్న రోహిత్
  • గతంలో ఇదే షాట్ తో ఎన్నో బౌండరీలు సాధించానని వ్యాఖ్య
I play like this says Rohit Sharma

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఔటైన తీరును క్రికెట్ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. 44 పరుగుల వద్ద దూకుడుగా ఆడుతున్న సమయంలో సునాయాసమైన క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంపై సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా వంటి విశ్లేషకులు విమర్శలు గుప్పించారు.

మరోవైపు తనపై వస్తున్న విమర్శలపై రోహిత్ శర్మ స్పందించాడు. ఆ షాట్ ఆడినందుకు తాను బాధ పడటం లేదని అన్నాడు. ఇదే టెక్నిక్ తో గతంలో తాను ఎన్నో బౌండరీలను సాధించానని చెప్పాడు. బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలాంటి షాట్లను ఆడుతుంటానని... ఇకపై కూడా తాను ఇలానే ఆడుతుంటానని తెలిపాడు.

ఈ షాట్ ఆడినప్పుడు కొన్ని సార్లు బంతి బౌండరీకి అవతల పడొచ్చని... కొన్నిసార్లు క్యాచ్ ఔట్ కావచ్చని చెప్పాడు. జట్టు తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచిందని... దానికి తగ్గట్టుగా ఆడటం తన బాధ్యత అని అన్నాడు. విమర్శల గురించి తాను అసలు పట్టించుకోనని... తన దృష్టి మొత్తం ఆటపైనే ఉంటుందని చెప్పాడు.