Bharat Biotech: కొవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే పరిహారం చెల్లిస్తాం: భారత్ బయోటెక్

  • దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
  • కొవాగ్జిన్ కు అత్యవసర అనుమతులు
  • కొవాగ్జిన్ పనితీరుపై భారత్ బయోటెక్ ధీమా
  • ఎంతో సురక్షితమైనదని వెల్లడి
  • వ్యాక్సిన్ అందించే సమయంలోనే పత్రంపై సంతకం
Bharat Biotech ready to compensate if serious side effects will be happen with Covaxin

దేశీయంగా కరోనా వ్యాక్సిన్ (కొవాగ్జిన్)ను అభివృద్ధి చేయడం ద్వారా భారత్ బయోటెక్ పరిశోధక సంస్థ  భారత కీర్తిపతాకను అంతర్జాతీయంగా రెపరెపలాడిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, తాము రూపొందించిన వ్యాక్సిన్ పై ఈ సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. కొవాగ్జిన్ అత్యంత సురక్షితమైనదని చెబుతున్న భారత్ బయోటెక్.. ఒకవేళ తమ వ్యాక్సిన్ తో ఎవరికైనా తీవ్రస్థాయిలో దుష్పరిణామాలు కలిగితే వారికి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమని తెలిపింది.

వ్యాక్సిన్ తో సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ కలిగితే ప్రభుత్వం నిర్ధారించిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందే వీలుంటుందని, తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే తగిన పరిహారం చెల్లిస్తామని వివరించింది. అయితే, ఆ దుష్పరిణామాలు వ్యాక్సిన్ కారణంగానే అని నిరూపితమైతేనే తాము పరిహారం అందిస్తామని స్పష్టం చేసింది.

ఈ మేరకు వ్యాక్సిన్ అందించే సమయంలో ఓ పత్రంపై సంతకం చేయించుకోవాలని భారత్ బయోటెక్ నిర్ణయించుకుంది. కొవాగ్జిన్ టీకా తీసుకునే వారు భారత్ బయోటెక్ విధివిధానాలకు అంగీకరిస్తున్నట్టు ఆ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. భారత్ లో కొవిషీల్డ్ తో పాటు అత్యవసర అనుమతులు పొందింది కొవాగ్జిన్ మాత్రమే.

More Telugu News