బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకు హిందుత్వంపై ప్రేమ ఉందా?: అంబటి రాంబాబు

16-01-2021 Sat 16:10
  • మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు
  • అధికారంలోకి రాలేననే భయంతో విష ప్రచారం చేస్తున్నారు
  • టీడీపీ, బీజేపీ చేసిన ఉందంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి
Ambati Rambabu once again targets Chandrababu

మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్న వారిని తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని... తిరిగి అధికారంలోకి రాలేననే భయంతో ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

టీడీపీ, బీజేపీ కలిసి చేసిన ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అంబటి అన్నారు. మత సామరస్యానికి ఏపీ ప్రతీక అని... రాష్ట్రంలో మతాల మధ్య ఘర్షణ లేదని చెప్పారు. మతాలు, కులాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకు హిందుత్వంపై ప్రేమ ఉందా? అని నిలదీశారు. భూమా అఖిలప్రియ అరెస్ట్ అంశంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.