గంగిరెద్దుల వేషంలో కొత్త పచ్చ గ్యాంగ్ తిరుగుతోంది: విజయసాయిరెడ్డి

16-01-2021 Sat 15:20
  • మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి పని
  • రామతీర్థం నుంచి ఎవరి అజమాయిషీలో దాడులు జరిగాయి?
  • పచ్చ నేతలు, పచ్చ మీడియా ప్రతినిధుల పాత్ర ఎంత?
Vijayasai Reddy slams TDP

విగ్రహాల విధ్వంసం అంశం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. విగ్రహాలు ధ్వంసమవుతున్నా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇంత వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారంటూ పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, విగ్రహాల విధ్వంసం వెనుక తెలుగుదేశం పార్టీ  కుట్రలు ఉన్నాయని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీపై మరోసారి ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

పండగపూట గంగిరెద్దుల వేషంలో కొత్త పచ్చ గ్యాంగ్ తిరుగుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, వర్గ వైషమ్యాలను రగల్చడమే వారి పని అని వ్యాఖ్యానించారు. రామతీర్థం నుంచి ఎవరి అజమాయిషీలో దాడులు జరిగాయి? విగ్రహాల ధ్వంసం కేసుల్లో పచ్చ నేతలు, పచ్చ మీడియా ప్రతినిధుల పాత్ర ఎంత? అని ప్రశ్నించారు.