విదేశాలలో నివసిస్తున్న జనాభాలో భారతీయులే టాప్!

16-01-2021 Sat 13:44
  • విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 1.80 కోట్లు
  • 1.10 కోట్ల మందితో రెండో స్థానంలో మెక్సికో, రష్యా
  • విదేశీయుల వలసలకు అతి పెద్ద గమ్యస్థానంగా అమెరికా
At 18 Million India Has The Worlds Largest Expatriates Population

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న జనాభాలో భారత్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. 2020 ఏడాదికి గాను మన దేశం వెలుపల నివసిస్తున్న భారతీయుల సంఖ్య అక్షరాలా 1.80 కోట్లుగా ఉంది. 1.80 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచంలో మరే దేశానికి చెందిన ప్రజలూ ఇంత భారీ సంఖ్యలో విదేశాలలో నివసించడం లేదు. మన కంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా సైతం ఈ విషయంలో వెనుకబడి ఉంది. ఈ వివరాలను ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.  

విదేశాల్లో ఉంటున్న భారతీయుల్లో ఎక్కువ మంది యూఏఈ, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో ఉన్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. భారత్ తర్వాతి స్థానాల్లో మెక్సికో (1.10 కోట్లు), రష్యా (1.1 కోట్లు), చైనా (1 కోటి), సిరియా (80 లక్షలు) ఉన్నాయి.

భారత్ విషయానికి వస్తే యూఏఈలో 35 లక్షల మంది, అమెరికాలో 27 లక్షల మంది, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది నివసిస్తున్నారు. భారతీయులు అత్యధికంగా ఉన్న ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, ఖతార్, బ్రిటన్ ఉన్నాయి. 2000 నుంచి 2020 మధ్య కాలంలో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మధ్య కాలంలో దాదాపు కోటి మంది విదేశీ బాట పట్టారు.

మరోవైపు విదేశీయుల వలసలకు అమెరికా అతి పెద్ద గమ్యస్థానంగా నిలిచింది. 2020లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వారు అమెరికాలో 5.1 కోట్ల మంది ఉన్నారు. ఎక్కువ మంది వలస వెళ్లిన గమ్యస్థాన దేశాల జాబితాలో అమెరికా తర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా (1.30 కోట్లు), రష్యా (1.20 కోట్లు), బ్రిటన్ (90 లక్షలు) ఉన్నాయి.  

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2020లో ప్రపంచ జనాభాలో 28.10 కోట్ల మంది తమ దేశాలకు వెలుపల నివసిస్తున్నారు. వీరిలో 23 శాతం మంది యూరోపియన్లే ఉన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న లేబర్ లో బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకకు చెందిన వారు అధికంగా ఉన్నారు.