స్నేహితుల విహార యాత్ర‌లో ట్రాజెడీ.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి!

16-01-2021 Sat 12:29
  • మృతులంతా బాల్య స్నేహితులు
  • క‌ర్ణాట‌క నుంచి గోవాకు బ‌య‌లుదేరిన మ‌హిళ‌లు
  • టిప్ప‌ర్ ఢీ కొట్ట‌డంతో మృతి
13 die in accident karnataka

వారంతా బాల్య స్నేహితులు.. బాల్యంలో తాము గ‌డిపిన ఆనంద క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుంటూ విహార యాత్ర‌కు వెళ్లాల‌నుకున్నారు. మినీ బ‌స్సులో అంతాక‌లిసి హాయిగా క‌బుర్లు చెప్పుకుంటూ వెళ్తుండ‌గా వారి వాహ‌నం ఓ టిప్ప‌ర్ ను ఢీ కొంది. ఈ ప్ర‌మాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా దావణగెరె నగర పరిధి విద్యానగరకు చెందిన వారే.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే సంక్రాంతి సందర్భంగా డ్రైవ‌రుతో పాటు 16 మంది మ‌హిళ‌లు, ఓ 16 ఏళ్ల అమ్మాయి గోవాకు విహార యాత్ర కోసం వెళుతున్నారు. కర్ణాటకలోని ధార్వాడ నగర శివార్లలో నిన్న‌ రోడ్డు ప్రమాదం సంభ‌వించి టిప్ప‌ర్ డ్రైవ‌ర్ స‌హా 13 మంది కన్నుమూశారు. స్నేహితురాళ్లు వెళ్తున్న మినీ బ‌స్సును టిప్పర్‌ ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో  మినీ బస్సును టిప్పర్  వేగంగా ఢీకొందని తేల్చారు.

మృతులు 35నుంచి 38 ఏళ్ల మధ్య వ‌య‌సున్న మ‌హిళ‌ల‌ని చెప్పారు. మ‌హిళ‌లంతా దావణగెరె నగరంలోని సెయింట్‌పాల్స్ స్కూల్ కు చెందిన ఒకప్పటి విద్యార్థులని చెప్పారు.  మృతుల పేర్లు మానసి, పరంజ్యోతి, రాజేశ్వరి, శకుంతల, ఉషా, వేదా, నిర్మల, మంజుల, రజని, ప్రీతి, పూర్ణిమ, ప్రవీణ, ఆశగా పోలీసులు గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో ఆరుగురికి గాయాలు కాగా, వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స‌హా ప‌లువురు నేత‌లు సానుభూతి తెలిపారు.