ఇప్పటికైనా అసలు దోషులను పట్టుకునే ప్రయత్నం చేయండి: ఏపీ మాజీ మంత్రి జవహర్‌

16-01-2021 Sat 10:32
  • ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పట్టుకోవడం డీజీపీకి చేత కావడం లేదు
  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతున్నారు
  • డీజీపీ వైసీపీ మంత్రిగా కనిపిస్తున్నారు 
AP DGP is behaving like YSRCP minister says Jawahar

దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీ, బీజేపీ నేతలు నేరుగా డీజీపీని టార్గెట్ చేస్తూ, తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.  

టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ, గౌతమ్ సవాంగ్ ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిగా కాకుండా వైసీపీ ప్రభుత్వంలోని మంత్రిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆలయాల్లో విధ్వంసానికి పాల్పడిన వారిని, విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడం చేతగాక... దాడుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ప్రజాప్రతినిధులు ఎంత దారుణంగా మాట్లాడినా, హిందువుల మనోభాలు దెబ్బ తినేలా మాట్లాడినా డీజీపీ పట్టించుకోరని జవహర్ అన్నారు. ఇదే సమయంలో ఆలయాల్లో అపచారం జరిగిందంటూ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం వెంటనే స్పందిస్తారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు డీజీపీకి కుట్రదారులుగా కనిపిస్తారని విమర్శించారు. ఇప్పటికైనా అసలు దోషులను పట్టుకునే ప్రయత్నాన్ని డీజీపీ చేయాలని డిమాండ్ చేశారు.