అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ.. యూపీ సీఎం రూ. 2 లక్షల విరాళం

16-01-2021 Sat 08:51
  • రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ
  • పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్న ప్రముఖులు
  • వజ్రాల వ్యాపారి రూ. 11 కోట్ల విరాళం
UP CM Yogi Adityanath donates 2 lakh rupees for ayodhya ram mandir

అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ మొదలైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించగా, తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2 లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ మేరకు యూపీ సమాచారశాఖ వెల్లడించింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన తర్వాత రామమందిర నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలయ నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు.

ఆలయ నిర్మాణం కోసం పలువురు ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ. 5,00,100 విరాళం ప్రకటించారు.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు రామాలయ నిర్మాణానికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. నటి ప్రణీత లక్ష రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే, సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్ భాయ్ డోలాకియా ఏకంగా రూ. 11 కోట్ల విరాళం ప్రకటించారు.