వివేకానందరెడ్డి హత్య వెనక లోతైన కుట్ర.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళ హక్కుల కార్యకర్త జోమున్

16-01-2021 Sat 08:02
  • మూడు రోజుల క్రితం జోమున్‌ను కలిసిన వివేకానందరెడ్డి కుమార్తె
  • రెండు నెలల్లో అన్ని విషయాలు బయటపెడతానని వెల్లడి
  • సిస్టర్ అభయ హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన జోమున్
Jomon Putherpurackal sensational comments on ys vivekas murder

వైసీపీ నేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్యపై కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య విషయంలో పలు అనుమానాలున్నాయని, లోతైన కుట్ర దాగి ఉందని అన్నారు.

అనుమానితుల గురించి ఇప్పుడే మాట్లాడడం సరికాదని, రెండు నెలల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు వెల్లడిస్తానని, తన వద్ద ఉన్న సాక్ష్యాలను బయటపెడతానని అన్నారు. ఢిల్లీలో ఓ తెలుగు న్యూస్ చానల్‌తో మాట్లాడిన ఆయన వివేకానందరెడ్డి హత్య గురించి పలు విషయాలు వెల్లడించారు.

మూడు రోజుల క్రితం వివేక కుమార్తె సునీతారెడ్డి తనను కలిసి తండ్రి హత్య గురించి చర్చించారని జోమున్ తెలిపారు. హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి సాక్ష్యాధారాల సేకరణలో ఎలా సాయం చేయాలన్న దానిపై చర్చించినట్టు చెప్పారు. వివేక హత్య కేసు నిందితులకు తప్పకుండా కఠిన శిక్ష పడేలా చేస్తామని ఆయన హెచ్చరించారు.
 
కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో నిందితులకు శిక్ష పడడంలో, సీబీఐ సాక్ష్యాధారాలు సంపాదించడంలో జోమున్ కీలక పాత్ర పోషించారు. చర్చి ఫాదర్ తన సోదరుడితోనే తనను హత్య చేయించేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలో తాను గాయాలతో బయటపడ్డానని తెలిపారు. చివరకు నిందితులకు శిక్ష పడిందని జోమున్ పేర్కొన్నారు.