ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న శతాబ్దిరాయ్.. టీఎంసీలోనే ఉంటానని స్పష్టీకరణ!

16-01-2021 Sat 06:31
  • ఢిల్లీ వెళ్లి షాను కలుస్తారని ప్రచారం
  • ఎంపీ అభిషేక్ బెనర్జీతో గంటపాటు సమావేశం
  • మనసు మార్చుకున్న బిర్భూమ్ ఎంపీ
I Am With Trinamool Actor Turned MP Ends Suspense

ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ శతాబ్దిరాయ్ యూటర్న్ తీసుకున్నారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. తాను టీఎంసీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కోల్‌కతాలో గత సాయంత్రం డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో గంటపాటు జరిగిన సమావేశం అనంతరం శతాబ్దిరాయ్ ఈ ప్రకటన చేశారు.‘‘నేను టీఎంసీలోనే ఉంటా. పార్టీలో నా సమస్య ఏంటనేది అభిషేక్ బెనర్జీకి వివరించా. నేను మమతా బెనర్జీ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. ఆమెతోనే ఉంటా’’ అని ఆమె వివరించారు.

బిర్భూమ్ ఎంపీ అయిన శతాబ్దిరాయ్ నిజానికి ఈ ఉదయం ఏడు గంటలకు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షాను కలుస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఢిల్లీ పర్యటనను తాను రద్దు చేసుకున్నట్టు గత సాయంత్రం తెలిపారు. ఆమె ప్రకటనతో టీఎంసీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న వేళ టీఎంసీ నేతలు వరుసపెట్టి బీజేపీలో చేరుతుండడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుకుంది. ఈ నేపథ్యంలో శతాబ్దిరాయ్ కూడా బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు షికారు చేయడం టీఎంసీ నేతలను కంగారుపెట్టింది. అయితే, ఆ వార్తలకు ఆమె చెక్ పెట్టడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.