ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకునే ముందు మా అనుమతి తప్పనిసరి: రాష్ట్రాలకు స్పష్టం చేసిన ఈసీ

15-01-2021 Fri 20:17
  • దేశంలో ఎన్నికల అధికారుల పరిస్థితిపై ఈసీ వ్యాఖ్యలు
  • స్వేచ్ఛాయుత ఎన్నికల వాతావరణం అవసరం 
  • అధికారులపై అనుచిత చర్యలు తగవని హితవు
  • రాజకీయ ప్రతీకారాలపై ఈసీ ఆందోళన
EC directed states and union territories over election officials issue

దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడమే తమ కర్తవ్యం అని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. ఈ క్రమంలో ఈసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎక్కడైనా గానీ ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలంటే తమ అనుమతి తప్పనిసరి అని ఈసీ వెల్లడించింది. చర్యల పేరిట ఎన్నికల అధికారులకు వాహనాలు, భద్రత, ఇతర సౌకర్యాలను కుదించే ప్రయత్నం చేయరాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.

అనేక రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు (సీఈఓ)లను సైతం టార్గెట్ చేస్తున్న దృష్టాంతాలను గమనించామని వెల్లడించింది. ముఖ్యంగా వారిని రాజకీయ ప్రతీకారాలకు బలి చేస్తున్న ధోరణులు ప్రబలుతున్నాయని వివరించింది.

వారి పదవీకాలం ముగియకముందే వారిని సాగనంపుతున్న చర్యలు కనిపిస్తున్నాయని ఈసీ పేర్కొంది. ఇలాంటి వేధింపులు ఓ భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయని, నిజాయతీగా పనిచేసే అధికారులపైనా ఈ ప్రభావం పడే అవకాశముందని వివరించింది. కష్టించి పనిచేసే అధికారులు ఇలాంటి చర్యలతో కుంగిపోవడమే కాదు, వారి కర్తవ్య దీక్ష కూడా కుంటుపడుతుందని, తద్వారా స్వేచ్ఛాయుత వాతావరణంలో సవ్య రీతిలో ఎన్నికలు జరపడంలో వారు వైఫల్యం చెందే అవకాశం ఉంటుందని ఈసీ తెలిపింది. పరిస్థితులు ఇలా ఉంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లుగా పనిచేసేందుకు అధికారులు ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించింది.