నిన్న లేని రాజకీయ కుట్ర ఇవాళ ఎలా వచ్చింది సార్?: సవాంగ్ పై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

15-01-2021 Fri 19:21
  • ఆలయాల ఘటనలపై డీజీపీ ప్రెస్ మీట్
  • ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర అంటూ వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన అచ్చెన్నాయుడు
  •  అంతలోనే మాట మార్చేశారు 
  • తాడేపల్లి కాంపౌండ్ తలంటిందా? అంటూ విమర్శలు
Atchannaidu fires on AP DGP Gautam Sawang

ఏపీలో ఆలయాలపై దాడుల వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందని, కొన్నికేసుల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసినవారిని పట్టుకోవడం చేతకాక, సామాజిక మాధ్యమాల్లో విగ్రహాల ధ్వంసం వార్తలను ఫార్వార్డ్ చేసిన టీడీపీ సానుభూతిపరులను నిందితులుగా చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు డీజీపీగా కంటే వైసీపీ అధికార ప్రతినిధి పదవికి సరిపోతారని వ్యంగ్యం ప్రదర్శించారు.

"డీజీపీ గారూ... ఖాకీ డ్రెస్ తీసేసి తాడేపల్లి కొంపలో బులుగు కండువా కప్పుకోవచ్చు కదా... ఎందుకీ డ్రామాలు!" అంటూ మండిపడ్డారు. నిన్న మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం ఘటనలు పిచ్చోళ్లు, దొంగలు, జంతువుల పనే అన్నారని, అంతలోనే మాట మార్చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. నిన్న లేని రాజకీయ కుట్ర ఇవాళ ఎలా వచ్చింది సార్? అంటూ నిలదీశారు. అంతలోనే తాడేపల్లి కాంపౌండ్ తలంటిందా? అంటూ ప్రశ్నించారు.