Somu Veerraju: బీజేపీ దూకుడు.. రేపు ముద్రగడను కలుస్తున్న సోము వీర్రాజు

  • రేపు ఉదయం 9 గంటలకు కీలక భేటీ
  • కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్తున్న సోము వీర్రాజు
  • ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం
Somu Veerraju to meet Mudragada Padmanabham tomorrow

ఏపీలో బీజేపీ నేతలు క్రమంగా దూకుడు పెంచుతున్నారు. కీలక నేతలకు గాలం వేస్తున్నారు. అధికార వైసీపీకి బీజేపీని ప్రధాన పోటీదారుగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఆయనను కలుస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ముద్రగడను బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరగుతున్నాయనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ముద్రగడ ప్రస్తుతం కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆహ్వానాన్ని ఆయన మన్నిస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. కాపు సామాజికవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు కలిగిన ముద్రగడ బీజేపీలో చేరితే... రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు సినీ నటి వాణి విశ్వనాథ్ ను కూడా సోము వీర్రాజు ఇటీవల కలిశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఆమె ఇంత వరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. బీజేపీలో ఆమె చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News