శ్రీశైలంలో దారుణం.. పెద్ద మొత్తంలో పట్టుబడ్డ చికెన్, మటన్!

15-01-2021 Fri 18:11
  • శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు
  • పట్టుబడ్డ 20 కేజీల మాంసం
  • సున్నిపెంట నుంచి శ్రీశైలంకు తరలిస్తున్న దుండగులు
Chicken and Mutton caught in Srisailam

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఘోర అపచారం చోటు చేసుకుంది. శ్రీశైలంలోని పలు ప్రాంతాలకు చికెన్, మటన్ ను తరలిస్తున్న వారిని ఒకటవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలం టోల్ గేట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుండగా... కొందరు వ్యక్తులు మాంసంతో పట్టుబట్టారు. వీరంతా సున్నిపెంట నుంచి శ్రీశైలంకు చికెన్, మటన్ తీసుకొస్తున్నారు. దాదాపు 20 కేజీల మటన్ వీరి వద్ద పట్టుబడినట్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహారెడ్డి తెలిపారు.

మాంసాన్ని తరలిస్తున్న వారిని శ్రీశైలం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేశారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలంలో మాంసం, మద్యం నిషేధం. అయితే కొందరు ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ వీటిని సరఫరా చేస్తుంటారు. తాజాగా ఈరోజు మాంసం దొరకడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.