సిరాజ్ పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు.. వీడియో ఇదిగో!

15-01-2021 Fri 17:52
  • బ్రిస్బేన్  టెస్టులో సిరాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు
  • యూ బ్లడీ గ్రబ్ అన్న ఆస్ట్రేలియా అభిమాని
  • వాషింగ్టన్ సుందర్ ను కూడా టార్గెట్ చేసినట్టు అనుమానం
Racist comments on Mohammed Siraj in Brisbane test

టీమిండియా క్రికెటర్లకు ఆస్ట్రేలియా టూర్ లో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా అభిమానులు చేస్తున్న జాత్యహంకార కామెంట్లు వారి మనసులను గాయపరుస్తున్నాయి. మొన్న సిడ్నీ టెస్టులో మన ఆటగాళ్లపై రేసిజం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్ర విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాను ఐసీసీ ఆదేశించింది. అయినా, ఆసీస్ ప్రేక్షకుల తీరు మారడం లేదు.

బ్రిస్బేన్ లో జరుగుతున్న టెస్టులో కూడా జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్ పై ఓ అభిమాని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. యూ బ్లడీ గ్రబ్ (గలీజు మనిషి) అంటూ కేకలు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో బౌలర్ వాషింగ్టన్ సుందర్ ను కూడా ప్రేక్షకులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.