కేంద్రం వర్సెస్ రైతులు... 9వ పర్యాయం కూడా చర్చలు విఫలమే!

15-01-2021 Fri 17:49
  • అసంపూర్తిగా ముగిసిన తొమ్మిదో దఫా చర్చలు
  • వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనన్న రైతులు
  • సవరణలు చేస్తామన్న కేంద్రం
  • అంగీకరించని రైతులు
  • మరోమారు సమావేశమవ్వాలని నిర్ణయం
  • ఈ నెల 19న భేటీ
Discussions between farmers and Union government fails again

జాతీయ వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధులు ఇవాళ సమావేశమయ్యారు. తొమ్మిదో పర్యాయం జరిగిన ఈ చర్చలు కూడా నిరాశాజనకమైన రీతిలో విఫలమయ్యాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్న తమ డిమాండును రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు మరోసారి గట్టిగా వినిపించారు.

పంటలకు కనీస మద్దతుధరను చట్టబద్ధం చేయాలని కోరారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ)ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలను ఆపాలని కోరారు. అయితే, కేంద్రం తమ పాత పంథాకే కట్టుబడింది. తమ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంది.

దాంతో, ఈ ప్రతిష్టంభనకు కారణమైన ఏ అంశంలోనూ స్పష్టత రాలేదు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను బలహీనపరిచే ఉద్దేశం తమకు లేదని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ రైతులు, ఆ విషయాన్ని నమ్మేందుకు తాము సిద్ధంగా లేమని మంత్రికి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, ప్రజల కోసం ఇంకెన్నిసార్లు అయినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని కేంద్రమంత్రుల బృందం పేర్కొంది. ఈ క్రమంలో ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి చర్చలు జరపాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.

చర్చల్లో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందిస్తూ, ఇవాళ జరిగిన భేటీలో ఎలాంటి పరిష్కారం లభించలేదని వెల్లడించారు. త్వరలోనే ఈ అంశానికి తెరపడుతుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పరిష్కారం కోసం సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.