బిట్ కాయిన్ల రూపంలో రూ.1,800 కోట్లు పోగేశాడు.. పాస్​ వర్డ్​ మాత్రం మరిచాడు!

15-01-2021 Fri 13:50
  • బిట్ కాయిన్లను ‘ఐరన్ కీ’లో దాచిన ఓ వ్యక్తి
  • దానిని తెరిచేందుకు పది సార్లే అవకాశం
  • ప్రపంచవ్యాప్తంగా నెట్ లోనే లాక్ అయిన సంపద రూ.9.5 లక్షల కోట్లు!
This Man Has Rs 1800 Crore in Bitcoin But Cant Get a Penny as He Lost His Password
పాస్ వర్డే కదా అని లైట్ తీసుకున్నారా.. కథ ఖతం అయిపోవచ్చు. దానిని మరిచిపోతే పూడ్చలేని నష్టం జరగొచ్చు. మరిచిపోతే.. మళ్లీ కొత్తది పెట్టుకోవచ్చంటారేమో! ఇక్కడ ఆ చాన్స్ లేదు. అలాంటి దయనీయ స్థితిలోనే ఉన్నాడు ఓ వ్యక్తి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది అతగాడి పరిస్థితి.

అవును మరి, ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.1,800 కోట్లు కళ్ల ముందు కనిపిస్తున్నా తీసుకోలేని దయనీయ పరిస్థితి అతడిది. పాస్ వర్డ్ మరిచిపోవడంతో కష్టపడి సంపాదించి దాచిందంతా ‘నెట్’ పాలయ్యే దాకా వచ్చింది.

అతగాడి పేరు స్టెఫాన్ థామస్. సంపాదనను బిట్ కాయిన్ల రూపంలో దాచుకున్నాడు. ఇప్పటిదాకా 7,002 బిట్ కాయిన్లను సంపాదించుకున్నాడు. అయితే, జీవితాంతం వాటిని భద్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో ‘ఐరన్ కీ’ అనే ఓ చిన్ని ఎన్ క్రిప్టెడ్ (ఎవరూ అక్రమంగా చొరబడకుండా లేదా దొంగిలించకుండా కోడ్ రూపంలో సమాచారాన్ని భద్రంగా దాచి ఉంచడం) హార్డ్ డ్రైవ్ లో పెట్టాడు. అక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. దానిని అకౌంట్ ఉన్న వాళ్లు తెరవాలంటే పాస్ వర్డ్ తప్పనిసరి. పాస్ వర్డ్ మరిచిపోతే పది సార్లు ప్రయత్నించే అవకాశం ఉంటుంది.

పదోసారి తప్పుగా ఎంటర్ చేశామా.. ఇక అంతే సంగతులు. అందులో ఉన్న సమాచారంగానీ, డబ్బు గానీ, సంపద గానీ.. ఏవైనా మన చేతికి రానట్టే. అలాగని ఆ ఐరన్ కీని నడుపుతున్న వాళ్లకు పోతుందా అంటే అదీ కాదు. అసలు దానికంటూ ఓ మేనేజ్ మెంటే ఉండదు. వట్టిగా అలా వదిలేసుకోవాలంతే.

ఇప్పుడు థామస్ పరిస్థితి కూడా దాదాపు అదే. ఇప్పటికే 8 సార్లు పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేశాడు. ఇంకో రెండు చాన్స్ లే అతడికి మిగిలున్నాయి. పాస్ వర్డ్ ఏంటో కూడా అతడికి గుర్తు లేదు. ఇప్పటిలెక్కల ప్రకారం 7,002 బిట్ కాయిన్ల విలువ 24.5 కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.1,800 కోట్లు. అందుకే, మిగిలివున్న ఆ రెండు ఛాన్సుల గురించే తెగ ఆలోచిస్తున్నాడు. అవి కూడా మిస్సయ్యాయంటే .. ఇక ఆ డబ్బు గోవిందానే!

ఇలాంటి పరిస్థితి థామస్ ఒక్కడిదే కాదు. బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ కింద సంపదను దాచుకుంటున్న వాళ్లందరిదీ దాదాపు అదే పరిస్థితి. బిట్ కాయిన్ నిర్వహణకు వ్యవస్థాగత నిర్మాణమంటూ ఏదీ లేదు. దానిని నియంత్రించే ప్రభుత్వ సంస్థలూ లేవు. దాంట్లో ఉన్న డేటాను తీసుకోవడానికి మాస్టర్ కీ అంటూ ఏమీ లేదు. మొత్తంగా దానికి ఒకే ఒక్కరు ఖాతాదారుంటారు. నామినీలు వంటి వాళ్లెవరూ ఉండరు. సదరు ఖాతాదారు తన కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకు బిట్ కాయిన్ ఖాతా వివరాలు ఇస్తే తప్ప దాని గురించి తెలిసే చాన్స్ లేదు. పాస్ వర్డ్ మరిచిపోతే తిరిగి తీసుకునే వెసులుబాటూ లేదు.

పాస్ వర్డ్ లు మరచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిట్ కాయిన్లలో 20 శాతం వరకు సంపద నెట్ లోనే లాక్ అయిపోయిందట. ఆ మొత్తం విలువ 13 వేల కోట్ల డాలర్లట. అంటే రూ.9.5 లక్షల కోట్లపైమాటే. ఈ సంపద అటు యజమానులకు దక్కక.. ఇటు ప్రభుత్వానికి రాక.. అటూఇటూ కాకుండా ఉండిపోయిందన్నమాట. చూశారా.. పాస్ వర్డ్ మరిచిపోతే ఎన్ని నష్టాలో!