IMF: ఆర్థిక వృద్ధికి భారత్ తీసుకున్న నిర్ణయాలు భేష్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా

  • ఈ ఏడాది ఆర్థిక రంగంపై ప్రభావం అంతంతే
  • అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు జీడీపీ కన్నా  కొంచెం ఎక్కువే
  • కరోనా మహమ్మారి కట్టడిలో నిర్ణయాత్మక చర్యలు
IMF chief lauds Indias efforts in reviving economy after Covid19

భారత్ తీసుకున్న కొవిడ్ నియంత్రణ చర్యలు బాగున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జీవా కొనియాడారు. మహమ్మారి వల్ల ఆర్థిక రంగంపై పడిన ప్రభావాన్ని తగ్గించేందుకు భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ప్రశంసించారు. 2021లోనూ ఆర్థిక రంగ పునరుత్తేజం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. గురువారం అంతర్జాతీయ మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై జనవరి 26న విడుదల చేయబోయే నివేదికపై ఆమె మాట్లాడారు.

భారత ఆర్థిక రంగంపై ఈ ఏడాది ప్రభావం అంతగా ఉండదని చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక పరిణామాలపై నిర్ణయాత్మకంగా ముందుకు సాగిందని అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లాంటి పెద్ద దేశంలో లాక్ డౌన్ పెట్టడం అంత సాధారణ విషయం కాదని, కానీ, భారత ప్రభుత్వం లక్షిత ఆంక్షలు, లాక్ డౌన్లు విధించి ప్రభావాన్ని చాలా వరకు తగ్గించిందని కొనియాడారు. ఆంక్షలతో పాటు విధానపర మద్దతునూ ప్రజలకు అందించిందన్నారు.

లాక్ డౌన్ లో ఆర్థిక మందగమనం కనిపించినా.. ఆ తర్వాత ఆర్థిక పునరుజ్జీవం కోసం మంచి నిర్ణయాలు తీసుకుందని ఆమె ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని జీడీపీ విషయంలో భారత్ దే పైచేయి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగటున ఆరు శాతం వృద్ధి అంచనా వేశామని, కానీ, భారత్ దాని కన్నా కొంచెం ఎక్కువ వృద్ధే నమోదు చేస్తుందని చెప్పారు. జీడీపీ వృద్ధికి మరిన్ని చర్యలు తీసుకునేందుకూ అవకాశం ఉందన్నారు.

More Telugu News