ఈ నెల 17 నుంచి మిగిలిన ఆలయాలను కూడా సందర్శిస్తా: చినజీయర్ స్వామి

14-01-2021 Thu 19:32
  • ఏపీలో ఆలయాలపై దాడులు
  • ఇటీవలే రామతీర్థం ఘటన
  • ఇవాళ రామతీర్థం విచ్చేసిన చినజీయర్
  • ఆలయాల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచన
  • సాధారణ రీతిలో యాత్ర చేపడుతున్నట్టు వెల్లడి
Chinna Jeeyar Swamy set to tour temples across AP

ఏపీలో గత కొంతకాలంగా ఆలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనపై త్రిదండి చినజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటన ఆలయాల భద్రతకు సంబంధించి మేలుకొలుపు వంటి ఘటన అని, ప్రభుత్వం అన్ని ఆలయాలకు తగిన భద్రత కల్పించాలని సూచించారు. ఆయన ఇవాళ విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించారు. రాముడి విగ్రహం తల నరికిన ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్న చినజీయర్, ఘటన స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 17 నుంచి ఏపీలో మిగిలిన ఆలయాలను కూడా సందర్శిస్తానని వెల్లడించారు. తన పర్యటనకు రాజకీయాలతో సంబంధంలేదని స్పష్టం చేశారు. తన పర్యటన సాధారణమైనదని పేర్కొన్నారు. ఆయా ఆలయాల్లో భద్రతా లోపాలను గుర్తించి, అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తామని వివరించారు. రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచనలు చేశానని చినజీయర్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.