China: చైనా ఘనత... డ్రైవర్ లెస్ కార్లతో మాట్లాడే స్మార్ట్ రహదార్ల నిర్మాణం విజయవంతం!

  • కార్లకు దిశానిర్దేశం చేసే రహదారులు
  • వుక్సి నగరంలో నిర్మించిన హువేయి
  • ఎక్స్-బస్ కోడ్ నేమ్ తో ప్రాజెక్టు
Huwai Built Road that talk to Driverless Car

చైనా మరో ఘనతను సాధించింది.డ్రైవర్ రహిత కార్లతో ప్రతి క్షణం మాట్లాడుతూ, ఆ కార్లకు దిశానిర్దేశం చేసే రహదార్లను నిర్మించింది. చైనాకు చెందిన హువేయి, ఈ స్మార్ట్ రోడ్ ను నిర్మించింది. జియాంగ్రూ ప్రావిన్స్ లోని వుక్సి నగరంలో నాలుగు కిలోమీటర్ల మేరకు ఈ స్మార్ట్ రోడ్ ను నిర్మించింది. ఈ రహదారిపై సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు వెళుతుంటే, రహదారిపై ఉండే సెన్సార్లు, రాడార్లు వాటంతట అవే వాహనంతో అనుసంధానమవుతాయి.

ఆపై బస్టాప్ లు ఎక్కడ ఉన్నాయి? ట్రాఫిక్ లైట్స్, స్ట్రీట్ సైన్స్ తదితరాల గురించి వాహనానికి సమాచారం అందుతుంది. హువేయి టెక్నాలజీస్ సంస్థ, దాని భాగస్వామ్య సంస్థలు కలిసి టెలికం ఉపకరణాలను వాడుతూ, చైనాతో తొలి జాతీయ ప్రాజెక్టుగా ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టాయి. ట్రాఫిక్ మరింత సురక్షితంగా చేయడం లక్ష్యంగా చైనా ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది.

"సెన్సార్లు, కెమెరాలు, రాడార్లను రహదారుకు, స్ట్రీట్ లైట్లు, ట్రాఫిక్ లైట్స్, బస్ స్టాపులపై అమర్చారు. చైనా టెక్ దిగ్గజం హువేయి ఎన్నో దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటున్న వేళ, ట్రాఫిక్ సాంకేతికతవైపు నడుస్తోంది" అని బ్లూమ్ బర్గ్ క్విక్ టేక్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ప్రకటించింది.

ఇక ఈ రహదారి ప్రాజెక్టుకు ఎక్స్ - బస్ అని కోడ్ నేమ్ పెట్టారు. ఇది ట్రాన్స్ పోర్ట్ విభాగం నేతృత్వంలోని కంట్రోల్ నెట్ వర్క్ కు అనుసంధానమై ఉంటుంది. రహదారిపై ఉన్న అన్ని వాహనాల వివరాలు, వాటి వేగం తదితరాలన్నింటినీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండవచ్చు. ఈ సమాచార బట్వాడా వ్యవస్థ రెండు వైపులా జరుగుతుంది. రోడ్డు నుంచి వాహనానికి, వాహనం నుంచి రోడ్డుకు ఇన్ఫర్మేషన్ వెళుతుంటుంది.

కాగా, హువేయి సంస్థ షెన్ జన్ కేంద్రంగా నడుస్తోంది. ప్రధానంగా నెట్ వర్క్ వ్యాపారంలో ఉన్న ఈ సంస్థ తమ జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తోందంటూ, అమెరికా దీనిపై ఆంక్షలు విధించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సంస్థ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రెన్ జెంగ్ ఫాయ్, తొలుత స్మార్ట్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే, ఆయన నిర్ణయాన్ని సంస్థ ఉన్నతోద్యోగులు సమర్ధించలేదు. దీంతో ఆయన ఇంటెలిజెంట్ వెహికిల్ సాంకేతికత, అందుకు అవసరమైన పరికరాల తయారీపై దృష్టిని సారించారు.

More Telugu News