India: రూ. 45,696 కోట్లతో యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్న ఇండియా!

  • 63 యుద్ధ, 10 శిక్షణ విమానాల కొనుగోలుకు డీల్
  • ప్రధాని అధ్యక్షతన సీసీఎస్ సమావేశం
  • మరింత బలోపేతం కానున్న వాయుసేన
India To Buy 83 Tejas Light Combat Aircrafts

భారత వాయుసేన అవసరాలను తీర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన సీసీఎస్ (క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.45,696 కోట్ల అంచనా వ్యయంతో 73 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలను, మరో 10 శిక్షణ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తేజస్ యుద్ధ విమానాలు పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయన్న సంగతి తెలిసిందే.

ఎంకే-1ఏ లైట్ కాంబాయ్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు నాలుగో తరానికి చెందినవి. వీటిల్లో ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్, గాల్లోనే ఇంధనం నింపుకునే సదుపాయంతో పాటు ఏఈఎస్ఏ సదుపాయాలుంటాయి. భారత వాయుసేనకు ఇవి వెన్నెముకగా నిలుస్తాయని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే తేజస్ విమానాలు దేశ రక్షణకు ఎంతో ఉపకరిస్తాయని, వీటిల్లో ఇంతవరకూ వాడని టెక్నాలజీని వాడారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

నూతన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంతో భారత వాయుసేన మరింత బలోపేతమైందని రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు. ఈ డీల్ కారణంగా మరిన్ని కొత్త ఉద్యోగాలు సైతం లభించనున్నాయని అన్నారు. ఇదిలావుండగా, సీసీఎస్ కమిటీ సమావేశంలో ఈ యుద్ధ విమానాల నిర్వహణ, మరమ్మతులకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది.

More Telugu News