Mamata Banerjee: వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిందే: మమత సోదరుడి సంచలన వ్యాఖ్యలు

  • త్వరలోనే బీజేపీలో చేరిక?
  • ప్రజల గురించి ఆలోచించిన తర్వాతే కుటుంబం గురించి ఆలోచించాలని సూచన
  • ప్రజల స్థితిగతులు మెరుగవ్వాలన్న కార్తీక్ బెనర్జీ   
Dynasty politics should end karthik banerjee

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సోదరుడు కార్తీక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం పనిచేసే నాయకులపై విసుగొచ్చేసిందన్న ఆయన.. ప్రజల స్థితిగతులు మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరంగా పరిణమించాయని రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతలోనే కార్తీక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న ప్రశ్నకు కార్తీక్ బదులిస్తూ.. రాజకీయాల్లో జరుగుతున్న వంచన గురించే తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

 ప్రజల స్థితిగతులను రాజకీయాలు మార్చాలని, ప్రజా సేవలో ఉన్నవారు మన రుషుల సూచనలు మరిచిపోకూడదని అన్నారు. ప్రజల గురించి ఆలోచించిన తర్వాత కుటుంబం గురించి ఆలోచించాలని అన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేయలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తాను చెప్పలేనని స్పష్టం చేశారు.

More Telugu News