చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారమన్న కేంద్ర మంత్రి.. వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసిన రైతులు

14-01-2021 Thu 09:13
  • లక్ష ప్రతులను దహనం చేసిన రైతులు
  • చర్చల కొనసాగింపునకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి
  • చట్టాలు రద్దు చేసిన రోజునే లోహ్రి జరుపుకుంటామన్న రైతులు
Talks will continue with farmers says Union minister

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పరిషోత్తం రూపాల పేర్కొన్నారు. రైతులతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులు నిన్న భోగి మంటల్లో వేసి వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశారు. లక్ష ప్రతులను దహనం చేసినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధి పరమ్‌జిత్‌సింగ్‌ చెప్పారు. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన రోజునే తాము లోహ్రీ (భోగి) పండుగను జరుపుకుంటామని రైతులు స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 26న వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ శివారులో పరేడ్ నిర్వహించనున్నట్టు ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది.