USA: దయచేసి నా అభిశంసన గురించి అమెరికన్లు ప్రస్తావించొద్దు: డొనాల్డ్ ట్రంప్ వీడియో విడుదల

  • మంచి కోసం ముందడుగు వేయండి
  • హింసకు అమెరికాలో తావు లేదు
  • దాడుల్లో పాల్గొన్నవారికి శిక్ష తప్పదు
  • యూఎస్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ వీడియో
Trump Latest Video on Impeachment

అమెరికన్ హిస్టరీలో తొలిసారిగా రెండుమార్లు అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా నిలిచిన డొనాల్డ్ ట్రంప్, ప్రజలను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. అమెరికన్లు అందరూ ఐకమత్యంతో ఉండాలని అంటూనే, తన అభిశంసన గురించి ఎవరూ ప్రస్తావించవద్దని విన్నవించారు.

"అందరు అమెరికన్లూ ఈ సందర్భాన్ని, జరుగుతున్న పరిణామాల నుంచి బయటకు వచ్చి, కలసి కట్టుగా ఉన్నామని ప్రపంచానికి చూపాలి. మన కుటుంబాల మంచి కోసం ముందడుగు వేయాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అది క్షమార్హం కూడా కాదు. అమెరికా చట్టపాలనకు లోబడిన రాజ్యం" అని గత వారంలో యూఎస్ కాంగ్రెస్ పై దాడికి దిగి విధ్వంసం సృష్టించిన తన అనుచరులను ఉద్దేశించి, ట్రంప్ హెచ్చరించారు. "ఎవరైతే గత వారంలో దాడుల్లో పాల్గొన్నారో, వారంతా చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు" అని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, జరిగిన అభిశంసనపై స్పందించిన హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, "నేడు ప్రజా ప్రతినిధులు విడిపోయారు. అయితే, ఎవరూ చట్టానికి అతీతులు కాదని మరోసారి నిరూపితమైంది. అది అమెరికా అధ్యక్షుడైనా సరే" అని అన్నారు. ఇక అభిశంసన తరువాత ఈ నెల 20లోగా సెనేట్ ట్రంప్ పై విచారణకు ఆదేశించే అవకాశాలు లేవు. అంటే, ట్రంప్ తన పదవీ కాలం ముగియక ముందే బలవంతంగా బాధ్యతలను వదిలేసే చాన్స్ లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒకవేళ 20 తరువాత బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, సెనెట్ విచారణ ప్రారంభించి, ట్రంప్ దోషిగా తేలితే మాత్రం 2024లో ఆయన మరోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు.

ఇదిలావుండగా, తన అభిశంసన నేపథ్యంలో ఈ ఉదయం ట్రంప్ ఓ వీడియోను విడుదల చేశారు. తన ట్విట్టర్ ఖాతాలను మూసివేయడంతో యూఎస్ గవర్నమెంట్ ఎకౌంట్ నుంచి దీన్ని ఆయన విడుదల చేశారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News