నా వల్ల కాదు.. నన్ను క్షమించండి: రజనీకాంత్ అభిమానులకు లారెన్స్ విజ్ఞప్తి

14-01-2021 Thu 07:00
  • రాజకీయాల్లోకి రావడం లేదని ఇటీవల స్పష్టం చేసిన రజనీకాంత్
  • వచ్చి తీరాల్సిందేనంటూ అభిమానుల డిమాండ్
  • తలైవా తన నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలంటూ లారెన్స్‌కు అభిమానుల మొర
  • తానా పని చేయలేనని తేల్చి చెప్పిన లారెన్స్
Actor Raghava Lawrence says apologies to Rajinkanth Fans

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ క్షమాపణలు తెలిపాడు. ఇటీవల అస్వస్థతతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్.. కోలుకున్న అనంతరం తాను రాజకీయ పార్టీ పెట్టబోవడం లేదంటూ స్పష్టం చేశాడు. తలైవా నిర్ణయంతో తీవ్ర నిరాశ చెందిన అభిమానులు రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.

అంతేకాదు, రజనీకాంత్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలంటూ లారెన్స్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన లారెన్స్.. తాను ఆ పని చేయలేనని, తనను క్షమించాలని అభిమానులను వేడుకున్నాడు.

రజనీకాంత్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలని చాలామంది తనకు మెసేజ్‌లు, ట్వీట్లు చేస్తున్నారని పేర్కొన్న లారెన్స్.. ఆయన నిర్ణయంతో అభిమానులు అనుభవిస్తున్న బాధకు రెట్టింపు బాధను తాను కూడా అనుభవిస్తున్నట్టు చెప్పాడు. రజనీ రాజకీయాల్లోకి రాకపోవడానికి వేరే కారణం ఏదైనా ఉండి ఉంటే మనం అభ్యర్థించవచ్చని, కానీ ఆయన ప్రధాన కారణం అనారోగ్యమని పేర్కొన్నాడు.

మన వల్ల ఆయన మనసు మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చి, మళ్లీ అనారోగ్యం పాలైతే జీవితాంతం మనం సిగ్గుతో బాధపడాల్సి ఉంటుందన్నాడు. ఆయన ఎప్పటికీ తన గురువేనని స్పష్టం చేశాడు. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనం ప్రార్థిద్దామని లారెన్స్ చెప్పుకొచ్చాడు.